రాజాసింగ్ ఎపిసోడ్.. గణేష్ మండపాల వద్ద నిఘా వర్గాలు

రాజాసింగ్ ఎపిసోడ్.. గణేష్ మండపాల వద్ద నిఘా వర్గాలు

హైదరాబాద్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 03వ తేదీన గోషామహల్ బంద్ కు శ్రీరాంసేన పిలుపునిచ్చింది. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్టేట్ ఇంటిలెజన్స్ అలర్ట్ అయ్యింది. రాజాసింగ్ ఎపిసోడ్ నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి ఇటీవలే చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా అనుచరులు నిరసనలు చేపడుతున్నారు. ఖైరతాబాదు గణేశ్ మండపం దగ్గర రాజాసింగ్ కు మద్దతుగా బుధవారం హిందూ సంఘాలు ఆందోళనలు చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వివిధ పట్టణాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోధన్, ఎల్లారెడ్డి, కరీంనగర్, ముస్తాబాద్ లలో హిందూ సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి.

భవిష్యత్తులో రాజాసింగ్ కు అనుకూలంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. రాజాసింగ్ కు అనుకూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా.. ఇంటిలిజెన్స్ కింది స్థాయి సిబ్బంది నేరుగా పోలీస్ బాస్ లకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు... వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా సిటీలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు అలెర్ట్ అయ్యారు. వినాయక మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని పోలీస్  సిబ్బందితో పాటు జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రప్పిస్తున్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు గైడ్ లైన్స్ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.