కోవర్టులుగా పనిచేసే వాళ్లను వదలిపెట్టను..రాజాసింగ్ వార్నింగ్

కోవర్టులుగా పనిచేసే వాళ్లను వదలిపెట్టను..రాజాసింగ్ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు : గత ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కోవర్టులుగా పనిచేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ విషయాన్ని తనకు ఇటీవల బీజేపీలో చేరిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత ప్రేమ్‌‌ సింగ్‌‌ రాథోడ్‌‌ చెప్పారన్నారు. “ఈసారి అలా చేసే వారిని వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి అక్కడికి సమాచారమిస్తే.. అక్కడి వారు ఇక్కడికి సమాచారం ఇస్తారు. ఈ విషయం మర్చిపోకండి. ఈ ఎన్నికలు నాకు జీవన్మరణ సమస్య. చావడానికైన భయపడను. చంపడానికైన భయపడను”అని రాజాసింగ్ హెచ్చరించారు. గురువారం నియోజకవర్గంలో జరిగిన ఓ మీటింగ్‌‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన వ్యూహాలను సొంత మనుషులే ప్రత్యర్థులకు చేరవేస్తున్నారని, ఎన్నికల తర్వాత మోసం చేసే వారి అంతు చూస్తానని హెచ్చరించారు. 2018లో తనను ఓడించటానికి ప్రయత్నించిన వారి లిస్ట్ తన దగ్గర ఉందని, ఎవరెవరు తన ప్రత్యర్థులతో టచ్‌‌లో ఉన్నారో తెలుసని చెప్పారు. గోషామహాల్‌‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ ఇటీవల బీజేపీలో చేరారు. రాజాసింగ్‌‌కు మద్దతుగా ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.

విక్రమ్ గౌడ్‌‌తో రాజాసింగ్ మీటింగ్.. 

మాజీ మంత్రి ముఖేశ్‌‌ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌‌ను ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు. ఎంజే మార్కెట్‌‌లోని ఆయన ఇంటికెళ్లి మాట్లాడారు. తనకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విక్రమ్‌‌ గౌడ్‌‌ను రాజాసింగ్‌‌ కోరారు. సుమారు 45 నిమిషాలు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. రాజాసింగ్ గెలుపు కోసం కృషి చేస్తానని విక్రమ్ గౌడ్ హామీ ఇచ్చారు. కాగా, గోషామహల్ టికెట్ కోసం విక్రమ్ గౌడ్ కూడా ప్రయత్నం చేశారు.