ఇన్నర్ టాక్: రాష్ట్ర బీజేపీ ఓవైపు.. రాజాసింగ్ మరోవైపు..

ఇన్నర్ టాక్: రాష్ట్ర బీజేపీ ఓవైపు.. రాజాసింగ్ మరోవైపు..

రాష్ట్రంలో బీజేపీకున్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీలో ఇతర నాయకులకు పొసగడం లేదని సమాచారం. బీజేఎల్పీ లీడర్ గా ఉన్న రాజాసింగ్ ను.. ఢిల్లీలో అమిత్ షా భేటీతో సహా ఇతర ఏ సమావేశాలకు పిలవడం లేదు. మరి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో రాజాసింగ్ ను ఇన్ వాల్వ్ చేస్తారా? లేదా అన్నది ప్రశ్నార్థకమే.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 119 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నేతలు ఎన్నికల్లో ఓడినా రాజాసింగ్ మాత్రం మళ్లీ గెలిచారు. గోషామహాల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాజాసింగ్ గెలవడం వరుసగా రెండోసారి. అయితే 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులతో రాజాసింగ్ కు సంబంధాలు అంతంతమాత్రమే. రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా రాజాసింగ్ స్వతంత్రంగా వ్యవహరిస్తారనే టాక్ పార్టీలో ఉంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాజాసింగ్ ను రాష్ట్ర పార్టీ నాయకులు దూరం పెడుతున్నారు. రాష్ట్రం నుంచి ఆయనొక్కరే గెలిచారు. బీజేఎల్పీ లీడర్ కూడా ఆయనే. అయితే బీజేపీ కోర్ కమిటీ సమావేశాలకు కానీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో కానీ ఎక్కడా రాజాసింగ్ ను ఇన్ వాల్వ్ చేయడం లేదు. ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో పార్లమెంట్ అభ్యర్థుల మీటింగ్ లో నలుగురు బీజేపీ నేతలు వెళ్లి కలిశారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, రామచంద్రరావు అమిత్ షాను కలిసిన వారిలో ఉన్నారు. అయితే బీజేపీ ప్రోటోకాల్ ప్రకారం అభ్యర్థుల ఎంపికలో కచ్చితంగా బీజేఎల్పీ నేతను ఇన్వాల్వ్ చేయాలి. కానీ… రాజాసింగ్ ను దూరం పెడుతోంది రాష్ట్ర నాయకత్వం. అసలు రాజాసింగ్ కు బీజేపీకి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.