సాగర్‌‌‌‌ బరిలో రాజగోపాల్‌‌‌‌రెడ్డి?

సాగర్‌‌‌‌ బరిలో రాజగోపాల్‌‌‌‌రెడ్డి?
  • ట్రయాంగిల్‌ ఫైట్‌కు ఆయనే కరెక్టనుకుంటున్న పార్టీ
  • ఇప్పటికే చాలా ప్రో బీజేపీ కామెంట్లు చేసిన మునుగోడు ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ ఇప్పుడు సాగర్ బై ఎలక్షన్‌పై ఫోకస్ పెట్టింది. బలమైన క్యాండిడేట్‌ను బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ తరఫున క్యాండిడేట్‌గా నిలబెడితే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తుండటం.. నల్గొండ ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు కావడంతో రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొని క్యాండిడేట్‌గా దింపాలని పార్టీ వర్గాలు అనుకుంటున్నట్టు చర్చించుకుంటున్నారు.

బీజేపీలో చేరేందుకు గత కొంతకాలంగా రాజగోపాల్‌‌‌‌రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. మొన్న తిరుపతి టూర్‌‌‌‌లోనూ ఈ విషయం స్పష్టం చేశారు. అంతకు ముందు కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిలబడటం కష్టమేనని విమర్శలు చేసి సొంత పార్టీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నారు. అయోధ్యలో రాముడి గుడికి విరాళమిచ్చి తన భక్తిని చాటుకున్నారు. వివిధ సందర్భాల్లో బీజేపీపై విధేయత ప్రదర్శిస్తున్న రాజగోపాల్‌‌‌‌రెడ్డిని సాగర్‌‌‌‌ ఎన్నికల్లో పార్టీ క్యాండిడేట్‌‌‌‌గా నిలిపితే ఎలా ఉంటుందని కమలదళంలో చర్చ సాగుతోంది. నోటిఫికేషన్ వెలువడక ముందే కాంగ్రెస్‌‌‌‌కు, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌‌‌‌రెడ్డి రాజీనామా చేస్తారని అనుకుంటున్నారు. దీంతో బీజేపీలో చేరేందుకు అడ్డంకులు తొలగిపోతాయని, బీజేపీ కూడా ఆయన నిర్ణయాన్ని బలపరిచే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం
జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలో పట్టున్న నేత

సాగర్‌‌‌‌లో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ రాజకీయ కురువృద్ధుడు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పోటీలో ఉండటం ఖాయమైంది. టీఆర్ఎస్ కూడా బలమైన క్యాండిడేట్‌‌‌‌ను రంగంలోకి దింపనుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ త్రిముఖ పోటీలో గట్టెక్కాలంటే గట్టి క్యాండిడేట్‌‌‌‌ను పోటీకి దింపాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఉమ్మడి జిల్లాలో పట్టున్న, సామాజిక వర్గాల కోణంలోనూ సమానమైన రాజగోపాల్‌‌‌‌రెడ్డిని బరిలోకి దింపుతారని చర్చ బీజేపీ లీడర్లలో మొదలైంది. కోమటిరెడ్డికి గతంలో ఎమ్మెల్సీగా, ఎంపీగా చేసిన అనుభవముంది. దీనికి తోడు బలమైన సామాజిక వర్గం కావడంతో పాటు కాంగ్రెస్ కేడర్ వెంట నడిచే అవకాశం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. సాగర్‌‌‌‌లో టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్సే గట్టి పోటీ అని భావిస్తున్న బీజేపీ.. రాజగోపాల్ రెడ్డిని నిలబెడితే నెగ్గుకురావొచ్చని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయం జనంలోనూ హాట్‌‌‌‌ టాపిక్‌‌‌‌గా మారింది.