ఓపెనింగ్‌‌ కు రెడీ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇయ్యాల 4221 ఇండ్ల గృహప్రవేశాలు

ఓపెనింగ్‌‌ కు రెడీ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇయ్యాల 4221 ఇండ్ల గృహప్రవేశాలు
  •     సిరిసిల్లలో అత్యధికంగా 2,822 ఇండ్లు ఓపెనింగ్
  •     ఇండ్ల నిర్మాణంలో స్టేట్‌‌లో సిరిసిల్లకు రెండో స్థానం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జెట్ స్పీడ్‌‌తో ముందుకు సాగుతున్నాయి. జూన్ 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఇండ్లను ప్రారంభించేందుకు రెడీ కాగా ఉమ్మడి జిల్లాలో 4,221 ఇండ్లను ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయడంలో సిరిసిల్ల స్టేట్‌‌లో సెకండ్ ప్లేస్‌‌లో ఉంది. జిల్లాలో అత్యధికంగా 2,822ఇండ్లను ప్రారంభించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే జిల్లాకు మంజూరైన ఇండ్లలో సగానికి పైగా పూర్తయ్యాయి. 

పూర్తయిన ఇండ్లలో సిరిసిల్ల సెకండ్ ప్లేస్‌‌

రాజన్న సిరిసిల్ల జిల్లాకు 6,449 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 5,768 గ్రౌండింగ్ కాగా.. ఇప్పటివరకు 2,818 ఇండ్లు దాదాపు పూర్తయ్యాయి. మరో 1,200 ఇండ్లు స్లాబ్ లెవల్‌‌లో,  నెల రోజుల్లో 1,750 ఇండ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం 57.17 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా  రాజన్న సిరిసిల్ల జిల్లా 46.17 శాతంతో సెకండ్ ప్లేస్‌‌లో ఉంది. 

  • జగిత్యాల జిల్లాకు 10,860 ఇండ్లు మంజూరు కాగా అందులో 8,995 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. వీటిలో 1,225 పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా పెద్దపల్లి జిల్లాకు 6,451ఇండ్లు శాంక్షన్‌‌ కాగా 3,040 ఇండ్లు పూర్తయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 1,909 ఇండ్లు ప్రారంభించుకోగా.. నేడు మరో 174 ఇండ్లు గృహ ప్రవేశాలు చేయనున్నారు. 
  • కరీంనగర్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కాస్త వెనుకబడింది. జిల్లాకు 10,779 మంజూరు కాగా 7వేలకు పైగా ఇండ్లు గ్రౌండ్ కాగా 4వేలకు పైగా ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. మంజూరైన ఇండ్లలో 3,500 ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. 

ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాం

జిల్లాలో జూన్ 1న ఇందిరమ్మ ఇండ్ల ఓపెనింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయవల్సిందిగా ఆఫీసర్లకు ఆదేశాలిచ్చాం. గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక ఆధికారులు చొరవ తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండ్ల ఓపెనింగ్‌‌లో ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులను భాగస్వాములను చేయబోతున్నాం. అందరి సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంత చేస్తాం.

– గరిమా అగ్రవాల్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్