ఐపీఎల్ 2026 లీగ్ చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న కీలక పోరు ఆసక్తికరంగా మారింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను భారీగా దెబ్బతీశాడు.
పరాగ్ 'కిరాక్' హాఫ్ సెంచరీ:
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) తక్కువ రన్స్‌కే అవుటయ్యాడు. అయితే, మరో ఎండ్‌లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో మాధవ్ తివారీ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఢిల్లీ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ కేవలం 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 51 పరుగులతో కిరాక్ హాఫ్ సెంచరీ బాదాడు.
ఒకే ఓవర్లో 3 వికెట్లు:
రాజస్థాన్ భారీ స్కోరు వైపు దూసుకెళ్తున్న సమయంలో 15వ ఓవర్ వేసిన సీనియర్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. హాఫ్ సెంచరీతో ప్రమాదకరంగా మారిన కెప్టెన్ రియాన్ పరాగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే డోనోవన్ ఫెరీరాను డకౌట్ చేసి పంపాడు. ఇక డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న రవి సింగ్ వచ్చి రాగానే ఫోర్ కొట్టినప్పటికీ.. ఆ మరుసటి బంతికే అతడిని ఎల్బీడబ్ల్యూ (LBW) చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో ఒకే ఓవర్లో 3 కీలక వికెట్లు పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ నడ్డి విరిచాడు స్టార్క్. ఆ తర్వాత వచ్చిన శుభమ్ దూబే (5) కూడా మాధవ్ తివారీ బౌలింగ్‌లో తక్కువ పరుగులకే అవుటయ్యాడు.
ఆదుకున్న ధ్రువ్ జురెల్:
వరుసగా వికెట్లు పడుతున్నా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఆఖర్లో దాసున్ శనక (10) ఒక భారీ సిక్సర్ కొట్టి స్టార్క్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా, జురెల్ కీలక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత లుంగి ఎన్‌గిడి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగగా.. మాధవ్ తివారీ, లుంగి ఎంగిడి చెరో 2 వికెట్లతో రాణించారు.
