IND vs ENG 2nd Test: కోహ్లీ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్..మరి సర్ఫరాజ్ పరిస్థితేంటి..?

IND vs ENG 2nd Test: కోహ్లీ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్..మరి సర్ఫరాజ్ పరిస్థితేంటి..?

టీమిండియా టెస్ట్ క్రికెట్ లో ఒకప్పుడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో ఆడేవాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ 4 స్థానం సచిన్ దే. ఈ దిగ్గజ ప్లేయర్ రిటైరైన తర్వాత దశాబ్దకాలంగా ఈ ప్లేస్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ లేకపోవడంతో  ఈ స్థానంలో ఆడేందుకు ఇద్దరు యంగ్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు రజత్ పటిదార్ అయితే మరొకరు సర్ఫరాజ్ ఖాన్. ఇద్దరు కూడా తొలిసారి భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశాలు ఎంతో ఇప్పుడు చూద్దాం. 

వ్యక్తిగత కారణాల వలన కోహ్లీ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకోవడంతో రజత్ పటిదార్ కు స్థానం దక్కింది. అయితే తొలి టెస్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. నెంబర్ 4 స్థానంలో సీనియర్ ప్లేయర్ రాహుల్ ఆడాడు. హైదరాబాద్ టెస్ట్ తర్వాత రాహుల్ గాయపడడంతో సర్ఫరాజ్ ను ఎంపిక చేశారు. రాహుల్ లేకపోవడంతో ఈ ప్లేస్ లో ఎవరు ఆడతారో అని ఆసక్తి నెలకొంది. సమాచారం ప్రకారం వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్టులో పటిదార్ నాలుగో స్థానంలో ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అవకాశాలను కొట్టి పారేయలేము. 

టీమిండియా ఒక్క పేసర్ ను మాత్రమే ఆడించాలనుకుంటే బ్యాటింగ్ డెప్త్ కోసం సర్ఫరాజ్ ను తుది జట్టులో ఆడించవచ్చు. అదే  జరిగితే పటిదార్, సర్ఫరాజ్ ఇద్దరికీ అవకాశం దక్కొచ్చు. ఒకవేళ భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మాత్రం సర్ఫరాజ్ బెంచ్ కు పరిమితమవ్వక తప్పదు. జడేజా స్థానంలో సుందర్ ను, సిరాజ్ స్థానంలో కుల్దీప్ ను ఆడించే అవకాశం ఉంది. మొత్తానికి రేపు (ఫిబ్రవరి 2) జరగబోయే టెస్టులో పటిదార్ ఆడటం దాదాపు కన్ఫర్మ్ కాగా.. సర్ఫరాజ్ కు ఛాన్స్ దక్కాలంటే అదృష్టం కలిసిరావాల్సిందే.  

ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ను ప్రకటించగా.. భారత తుది జట్టులో భారీ మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.