హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్‌లోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
కేసు వివరాల్లోకి వెళితే.. నిందితుడు చిలుకూరు సందీప్ కుమార్ అలియాస్ శ్యామ్ చేసిన ఘోరానికి వ్యతిరేకంగా పోలీసులు పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది. ఐపీసీ సెక్షన్ 376ABతో పాటు, పోక్సో చట్టం సెక్షన్ 6 r/w 5(m) కింద నేరం నిరూపితం కావడంతో.. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
అటు జైలు శిక్షతో పాటు బాధితురాలికి అండగా నిలిచేలా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి మూడు లక్షల రూపాయల నష్టపరిహారం మంజూరు చేయాలని స్పష్టం చేసింది. రాజేంద్రనగర్ పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు జరిపి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణను వేగంగా పూర్తి చేయించడంతో.. బాధితురాలికి త్వరితగతిన న్యాయం చేకూరినట్లు అయ్యింది.
