భారత క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. అండర్-19 వరల్డ్ కప్ లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించిన త్రిపుర మాజీ ఆల్ రౌండర్ రాజేష్ బానిక్ మరణించాడు. పశ్చిమ త్రిపురలోని ఆనందనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికారులు శనివారం (నవంబర్ 2) తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 31) ఆయన మరణం రాష్ట్ర క్రికెట్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. "ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను.. అండర్-16 క్రికెట్ జట్టు సెలెక్టర్‌ను మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ (TCA) కార్యదర్శి సుబారత డే విలేకరులతో అన్నారు.
1984న అగర్తలాలో జన్మించిన బానిక్.. 2002-03 సీజన్‌లో త్రిపుర తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. రైట్ హ్యాండర్ బ్యాటర్ తో లెగ్ బ్రేక్ స్పిన్ కూడా వేయగలడు. 42 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ త్రిపుర క్రికెటర్ 19.32 యావరేజ్ తో 1,469 పరుగులు చేశాడు. వీటిలో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93. అతను 24 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక అజేయ సెంచరీ (101*) కూడా ఉంది. త్రిపుర తరపున 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
త్రిపుర క్రికెట్ అసోసియేషన్ శనివారం తన ప్రధాన కార్యాలయంలో మాజీ క్రికెటర్‌కు నివాళులర్పించింది, రాష్ట్ర క్రికెట్ సెటప్‌పై శాశ్వత ప్రభావాన్ని చూపిన అంకితభావంతో కూడిన ఆటగాడిగా, గురువుగా ఆయనను గుర్తుచేసుకుంది. త్రిపుర స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్ కార్యదర్శి అనిర్బన్ దేబ్ మాట్లాడుతూ, బానిక్ సహకారం మైదానంలో అతని ప్రదర్శనలకు మించి ఉందని అన్నారు. క్రికెట్ కెరీర్ తర్వాత బానిక్ త్రిపుర అండర్-16 జట్టుకు సెలెక్టర్‌గా పనిచేశాడు.
