మమతకు రాజ్​నాథ్ ఫోన్

మమతకు రాజ్​నాథ్ ఫోన్
  • రాష్ట్రపతి ఎన్నికపై సంప్రదింపులు 
  • పవార్, ఖర్గే, అఖిలేశ్ తదితర నేతలతోనూ చర్చలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్​ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్​తోనూ రాజ్ నాథ్ మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత దశలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరి పేరునూ పార్టీ నేతలు చర్చించలేదని వెల్లడించాయి. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే సంప్రదింపులు కొనసాగుతున్నాయని, తర్వాత జరగబోయే ఎన్డీఏ సమావేశంలోనే రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లపై చర్చిస్తారని పేర్కొన్నాయి.