న్యూఢిల్లీ: దేశంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందంటూ రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్‌పై … దశాబ్దాలుగా దేశాన్ని ఏలినవారివల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటైన సమాధానం చెప్పడంతో గురువారంనాటి లోక్‌సభ జీరో అవర్ వేడెక్కింది. ధనవంతులైన వ్యాపారుల కంటే రైతులు తక్కువా అని ప్రభుత్వాన్ని రాహుల్‌గాంధీ నిలదీశారు. రాయితీలు, రుణ మాఫీ పేరుతో కోట్లాది రూపాయల్ని పెద్ద వ్యాపారులకు ఇస్తున్న సర్కార్… రైతుల్ని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్సే రైతులు దుస్థితి కారణమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. మోడీలా ఇంతకుముందు ఏ ప్రధానీ రైతుల కోసం పనిచేయలేదని రాజ్‌నాథ్ చెప్పారు. రాహుల్ తన ప్రసంగంలో కేరళ రైతు సమస్యల్ని ప్రస్తావించారు. వ్యాపారులకు కేంద్ర సర్కార్ 4.3 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చిందని, 5.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని రాహుల్ చెప్పారు. వ్యాపారులకు ఇంతగా సాయమందిస్తున్న ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించారు. 17వ లోక్‌సభ సమావేశాల్లో రాహుల్‌గాంధీ సభలో మాట్లాడ్డం ఇదే తొలిసారి. దీనికి మంత్రి రాజ్‌నాథ్ సమాధానమిస్తూ…కేంద్రం ఏడాదికి ఇస్తున్న ఆరు వేల ఆర్థిక సాయంతో రైతుల ఆదాయం 20 నుంచి 25 శాతం పెరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు ఎన్నో బాధలు పడుతున్నారన్న రాహుల్… కేరళలో అయితే వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. వాయనాడ్‌లో అప్పులు తీర్చలేక ఈఏడాదిలో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
