స్కామ్​లు, అవినీతికి కేరాఫ్​ కాంగ్రెస్, బీఆర్ఎస్​: రాజ్​నాథ్​ సింగ్

స్కామ్​లు, అవినీతికి కేరాఫ్​ కాంగ్రెస్, బీఆర్ఎస్​: రాజ్​నాథ్​ సింగ్

హైదరాబాద్/సికింద్రాబాద్/ఖమ్మం, వెలుగు: స్కామ్ లు, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘‘రాష్ట్రంలో అక్రమాలకు కేరాఫ్ గా మారిన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టి రాష్ట్ర ప్రజలు మంచి పని చేశారు”అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ బీజేపీ లోక్​సభ అభ్యర్థిగా ఆ పార్టీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్​నాథ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అనంతరం సికింద్రాబాద్ మహంకాళీ దేవాలయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహబూబా కాలేజీ ఆవరణలో విజయ సంకల్ప సభ నిర్వహించారు. అలాగే ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ వేసిన తర్వాత జడ్పీ సెంటర్​లో రోడ్ షో నిర్వహించారు.

 ఈ రెండు కార్యక్రమాల్లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. దక్షిణ భారత దేశానికి తెలంగాణ గేట్ వే అని, రాష్ట్రానికి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. అభివృద్ధి జరగాలని, అవినీతిరహిత పాలన రావాలని ప్రజలు ఉద్యమాలు చేస్తే.. వారి ఆకాంక్షలను వమ్ము చేస్తూ బీఆర్ఎస్​ నేతలు పదేండ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆయన మండిపడ్డారు. బోఫోర్స్, యూరియా, చక్కెర తదితర అనేక రకాల స్కామ్​లు చేసిన చరిత్ర కాంగ్రెస్​కు ఉందని ఎద్దేవా చేశారు. 

పదేండ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, అభివృద్ధికి కేరాఫ్ బీజేపీ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్నామని, 2027 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. ట్రిపుల్​ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం తదితర హామీలన్నింటినీ బీజేపీ అమలు చేస్తున్నదని అన్నారు. ఈసారి మళ్లీ మోదీ ప్రభుత్వమే రాబోతోందని.. అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేసి చూపిస్తామన్నారు. కిషన్ రెడ్డి తనతో పాటు పనిచేశారని, మీ సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తారని చెప్పారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వినోద్ రావులను గెలిపించాలన్నారు.  

ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన లేదు: లక్ష్మణ్

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ అంటున్నారని.. బీజేపీకి ఆ ఆలోచన లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే తిరగబడి కూలగొడుతారని స్పష్టం చేశారు.  

మోదీ నాయకత్వంలో ముందుకు: వినోద్​ రావు 

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్​ రావు అన్నారు. కానీ పదేండ్లలో ఖమ్మం జిల్లాకు ఒక్క ప్రాజెక్టు గానీ, పరిశ్రమ గానీ, హాస్పిటల్​గానీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఢిల్లీ కాంగ్రెస్, ఖమ్మం కాంగ్రెస్​ దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. 

కేంద్రమంత్రి హెలికాప్టర్ ​తనిఖీ

బీజేపీ రోడ్​ షోలో పాల్గొనేందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ హెలికాప్టర్​ను జిల్లా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సర్దార్​ పటేల్ స్టేడియంలోని హెలిప్యాడ్​ లో హెలికాప్టర్​ నిలిపి ఉంచిన సమయంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీలు చేసింది. 

కాంగ్రెస్​తోనే పోటీ: కిషన్​రెడ్డి 

రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ఏ సీటులోనూ డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని, తమకు కాంగ్రెస్​తోనే ప్రధాన పోటీ అని సికింద్రాబాబాద్ ​బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​కు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేసిందని విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు.