లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచ వేదికపై బలమైన, శక్తిమంతమైన దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలకు చేరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని తెలిపారు. భారతదేశానికి ప్రపంచంలో మునుపెన్నడూ లేనంత విశ్వసనీయత, గౌరవం దక్కాయన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన తన సొంత నియోజకవర్గం లక్నోలో పర్యటించారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ లక్నో కంటోన్మెంట్‌లోని కస్తూరిబా పార్క్‌లో 'ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరిట ఒక చెట్టు)' కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా ఒక మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించుకున్న 70 కోట్ల మొక్కలను నాటే లక్ష్యాన్ని కూడా కచ్చితంగా పూర్తి చేస్తామని వివరించారు.
