రక్షణ ఉద్యోగాలలో 10% ‘అగ్నివీర్’ రిజర్వేషన్

రక్షణ ఉద్యోగాలలో 10%  ‘అగ్నివీర్’ రిజర్వేషన్

నాలుగేళ్ల స్వల్ప కాలం కోసం  యువతను త్రివిధ దళాల్లోకి భర్తీ చేసుకునేందుకు ఉద్దేశించిన  ‘అగ్నిపథ్’ స్కీమ్ పై దుమారం రేగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు.  ‘అగ్ని పథ్’ స్కీమ్ ద్వారా నియమితులయ్యే వారిని అగ్ని వీర్లు అని పిలుస్తారు.  అర్హులైన అగ్నివీర్లకు  రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.  ఈ రిజర్వేషన్లు ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, 16 రక్షణ రంగ సంస్థల్లో అమలవుతాయని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను సవరించి ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.   వయోపరిమితికి సంబంధించి సముచితమైన సడలింపులు కూడా కల్పిస్తామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.  అగ్నిపథ్ పై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో శనివారం ఉదయం సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈమేరకు రాజ్ నాథ్ ప్రకటన చేశారు.  కాగా, అగ్నిపథ్ ఆందోళనలను చల్లార్చేందుకే కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని పరిశీలకులు అంటున్నారు.  ఇక పారా మిలటరీ బలగాలలోనూ 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ప్రకటించిన  సంగతి తెలిసిందే.