- కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ గనుక భారత్‌పై ఏవైనా దుస్సాహసాలకు పాల్పడితే.. ఆ దేశం మరిన్ని ముక్కలుగా విచ్ఛిన్నమవ్వడం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న రాజ్‌నాథ్ సింగ్, పాక్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన 1971 నాటి భారత్-–పాక్ యుద్ధాన్ని గుర్తు చేశారు.
‘‘55 ఏండ్ల క్రితం పాకిస్తాన్ చేసిన తప్పుకు ఆ దేశం రెండు ముక్కలైంది. ఆ పరాభవాన్ని వారు మరిచిపోయినట్టున్నారు. ఈసారి గనుక బెంగాల్ వైపు కన్నెత్తి చూస్తే.. పాకిస్తాన్ ఇంకెన్ని ముక్కలవుతుందో కేవలం ఆ దేవుడికే తెలుసు” అని ఎద్దేవా చేశారు. గతేడాది పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.
