గుండె సమస్యల్ని కనిపెట్టే పాకెట్ ఈసీజీ మెషిన్ 

గుండె సమస్యల్ని కనిపెట్టే పాకెట్ ఈసీజీ మెషిన్ 

ఈ మధ్యకాలంలో కార్డియాక్ అరెస్ట్ లాంటి గుండె సంబంధిత వ్యాధులవల్ల చాలామంది చిన్న వయసులోనే చనిపోతున్నారు. దీనంతటికీ కారణం మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శరీరానికి కావాల్సిన వ్యాయామం లేకపోవడమే అని చెప్తున్నారు డాక్టర్లు. ఇలానే డెహరాడూన్ కు చెందిన రాజ్ పుత్ జైన్ అనే యువకుడి స్నేహితుడు కూడా కేవలం 21 ఏండ్లకు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. అతనికొచ్చిన ఛాతి నొప్పిని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నాడు. అంతలోనే కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడు. ఇలా పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతున్న సంఘటనలు చూస్తున్నాం. 

కార్డియాక్ అరెస్ట్ వస్తుంటే.. ఛాతి దగ్గర భారంగా అనిపించి, నొప్పి కలుగుతుంది. అది కార్డియాక్ అరెస్టా, గ్యాస్ట్రిక్ ట్రబులా అన్నది అప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం. అవస్థ ఉన్నవాళ్లను అప్పటికప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లి టెస్టులు చేయించి, ట్రీట్మెంట్ ఇప్పించడం కష్టమే. హార్ట్ రేట్ మానీటర్ వాచ్ లు ఉన్నా వాటిని గుడ్డిగా నమ్మలేం. అందుకే, అందరికీ అందుబాటులో ఉండేలా, మొబైల్ తోనే టెస్ట్ చేసుకొని ప్రాబ్లమ్ తెలుసుకునేలా పాకెట్ ఈసీజీ మెషిన్ కనిపెట్టాడు రాజ్ పుత్ జైన్. దానికి స్పందన్ అనే పేరు పెట్టాడు. 

స్పందన్ ఈసీజీ మెషిన్ చూడ్డానికి కంప్యూటర్ మౌజ్ లా ఉంటుంది. దానికి రెండు మైక్రో యూఎస్ బీ పోర్ట్ లుంటాయి.  హార్ట్ రేట్ మానీటర్ కోసం స్పందన్ యాప్ ని క్రియేట్ చేశాడు జైన్. ఈసీజీ మెషిన్ కి ఉన్న పోర్ట్ లతో ఒకదాంతో మొబైల్ ని, ఇంకోదాంతో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ని ఛాతికి అమర్చుకోవాలి. అది హార్ట్ రేట్ ని మానీటర్ చేస్తుంది. ఆక్సీజన్ లెవల్స్, బ్రీతింగ్ లెవల్స్, హార్ట్ బీట్ ని ఫోన్ లోనే చూసుకోవచ్చు. శరీరంలో ఏదైనా తేడాగా అనిపిస్తే ఉన్న చోటునుంచే టెస్ట్ చేసుకోవచ్చు. స్పందన్ మెషిన్ కేవలం పది సెకండ్లలోనే రిజల్ట్ చూపిస్తుంది.

కాబట్టి, ప్రమాదాన్ని త్వరగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. స్పందన్ మెషిన్ కి బ్యాటరీ, ఆన్ ఆఫ్ బటన్లు గానీ ఏం ఉండవు. మొబైల్ కి కనెక్ట్ చేసినప్పుడు సిగ్నల్స్ ఏం అవసరం లేదు. కాబట్టి రిమోట్ ఏరియాల్లో, ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ మెషిన్ వాడుకోవచ్చు. ఈ మెషిన్ ని డెహరాడూన్ లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో టెస్ట్ చేశారు. విజయ వంతంగా పనిచేయడంతో మార్కెట్ లోకి ఆమోదించారు. స్పందన్ మెషిన్ ని ఇప్పటికే లక్ష మంది వాడుతున్నాడు. అమెజాన్ లాంటి ఆన్ లైన్ సైట్లలో కూడా అందుబాటులో ఉంది.