వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బయట ఎండలు మండిపోతుంటాయి. ఆ ఉక్కపోత భరించలేక ఏసీ ఆన్ చేస్తాం. తీరా ఏసీ వేసినా గది చల్లబడటానికి గంటల సమయం పడుతుంటే మాత్రం చిరాకు రావడం సహజం. వెంటనే మన మైండ్‌లోకి వచ్చే మొదటి ఆలోచన.. ఏసీలో గ్యాస్ అయిపోయిందేమో? లేదంటే రిపేర్ వచ్చిందేమో? అన్నవే. దీంతో ఎండ వేడిని తాళలేక వెంటనే ఏసీ మెకానిక్‌కు ఫోన్ చేసేస్తాం.
అయితే హడావిడిగా రిపేర్ కోసం అంటూ సర్వీస్ సెంటర్‌కు కాల్ చేసే ముందు కొన్ని చిన్న విషయాలు గమనిస్తే అనవసరమైన ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా.. మీ ఏసీని సూపర్ కూల్‌గా మార్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి..
గది వేడి - ఏసీ పోరాటం..
ఏసీ అనేది గదిలోని వేడిని బయటకు పంపి, చల్లదనాన్ని నింపే ఒక మెషిన్. సాధారణంగా ఏసీని 24 డిగ్రీల టెంపరేచర్ కు సెట్ చేస్తాం. కానీ మీ గది లోపల ఉష్ణోగ్రత అప్పటికే 45 డిగ్రీల వద్ద ఉందనుకోండి.. అప్పుడు ఏసీ ఆ వేడిని తగ్గించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే రూమ్ టెంపరేచర్ 35 డిగ్రీల వద్ద ఉంటే.. ఏసీ చాలా త్వరగా కూలింగ్ ఇస్తుంది. అంటే ఏసీ పనితీరు అది ఉండే గది వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.
కర్టెన్లు.. కేవలం అందం కోసమే కాదు..
మనం విండోస్ కి వాడే పలచని కర్టెన్లు సూర్యరశ్మిని, వేడిని లోపలికి రానిస్తాయి. దీనివల్ల గది సెగలా మారుతుంది. దీనికి బదులుగా బ్లాక్-అవుట్ లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు వాడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇవి బయటి వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీని కారణంగా గదిలోని ఏసీ త్వరగా చల్లబరుస్తుంది.
టెక్నికల్ ఫాల్ట్ అనుకునే ముందు ఇవి చూడండి..
* ఎండ నేరుగా పడుతుందా?: కిటికీల ద్వారా ఎండ నేరుగా గదిలోకి వస్తుంటే ఏసీ ఎంత సేపు వేసినా కూలింగ్ రాదు.
* గాలి లీక్ అవుతుందా?: తలుపులు, కిటికీల సందుల నుండి చల్లటి గాలి బయటకు వెళ్లకుండా చూసుకోండి.
* ఫిల్టర్ల శుభ్రత: ఏసీ ఫిల్టర్లపై దుమ్ము పేరుకుపోయినా గాలి సరిగ్గా రాదు. ఇది మీరే క్లీన్ చేసుకోవచ్చు.
సో AC రిపేర్ లో లేకపోయినా.. గదిలో వేడి ఎక్కువగా ఉంటే అది సరిగ్గా పని చేయదని గమనించండి. కాబట్టి ఇన్సులేషన్ మార్చడం, మంచి కర్టెన్లు వాడటం వల్ల చల్లదనం పెరగటంతో పాటుగా కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. ఏసీ లైఫ్ కూడా పెంచుకోవచ్చు. ఇకపై ఏసీ చల్లగా లేదని కంప్లైంట్ చేసే ముందు ఈ చిన్న హోమ్ వర్క్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ పరిశీలించాక కూడా ఏసీ మీరు అనుకున్నట్లుగా పనిచేయకపోతే అప్పుడు రిపేర్ లేదా సర్వీసింగ్ చేయించుకోండి.

