పెద్దల సభలో అదే రభస.. మణిపూర్​పై చర్చకు ప్రతిపక్షాల పట్టు

పెద్దల సభలో అదే రభస.. మణిపూర్​పై చర్చకు ప్రతిపక్షాల పట్టు

న్యూఢిల్లీ:పార్లమెంట్ సమావేశాల్లో శుక్రవారం కూడా ఉభయసభల్లో అదే గందరగోళం కొనసాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే మణిపూర్ లో పరిస్థితిపై చర్చ చేపట్టాలంటూ ఇండియా కూటమి సభ్యులు రోజూలాగే నిరసన మొదలుపెట్టారు. దీంతో రాజస్థాన్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, తాజాగా 14 ఏండ్ల బాలికను ఇటుకల బట్టీలో వేసి దహనం చేశారంటూ అధికార ఎన్డీఏ సభ్యులు లేవనెత్తారు. రాజస్థాన్​లో శాంతిభద్రతలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

ఇరుపక్షాల సభ్యుల అరుపులు, నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 12.30 వరకు చైర్మన్ వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం కాగానే అదే పరిస్థితి కొనసాగడంతో మరుసటి రోజుకు వాయిదా పడింది. సభలో ప్రతిష్ఠంభనను తొలగించేందుకని మధ్యేమార్గంగా రూల్ 167 కింద చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది. కానీ ఈ నెల 11న చర్చ చేపడతామని తెలిపింది. 

లోక్ సభలో మరో రెండు బిల్లులు..
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ లోక్ సభలో శుక్రవారం ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఈ గందరగోళం కొనసాగుతుండగానే రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు తెచ్చిన ఐఐఎంల (సవరణ) బిల్లు, 2023ను సభ వాయిస్ ఓట్​తో పాస్ చేసింది.  అలాగే సాయుధ బలగాల బలోపేతం కోసం తెచ్చిన ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ బిల్లును కూడా లోక్ సభ ఆమోదించింది.

సైలెంట్​గా ఉంటరా..ఈడీని ఇంటికి  రమ్మంటరా: మీనాక్షి లేఖి 
లోక్ సభలో గురు వారం ఢిల్లీ సర్వీ సెస్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన కామెంట్లు దుమారం రేపాయి. సభలో ఆమె మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎంపీ ఒకరు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహించిన మంత్రి.. ‘‘ఒక్క నిమిషం.. మీరు సైలెంట్​గా ఉండండి. లేదంటే మీ ఇంటికి ఈడీ వస్తది” అని హెచ్చరించారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు మండిపడ్డారు. సభలో మాట్లాడితే బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐల దుర్వినియోగం నిజమేనని, కేంద్రమంత్రి కామెంట్లే దీనికి నిదర్శనమని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.