- టెస్ట్‌లో అమన్‌ప్రీత్ సింగ్‌తో పాటు ఆరుగురికి పాజిటివ్
- నైజీరియన్స్ నుంచి కొకైన్ కొనుగోలు
- హైదర్షాకోట్లోని అపార్ట్మెంట్ అడ్డాగా దందా
- ఇద్దరు నైజీరియన్స్ సహా ఐదుగురు అరెస్ట్
- 200 గ్రా. కొకైన్, సెల్‌ఫోన్స్, పాస్‌పోర్టులు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు : సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కొకైన్ తీసుకుని సైబరాబాద్ పోలీసులకు పట్టుబడినట్టు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డ్రగ్స్ సప్లయర్స్ నుంచి అమన్ రెగ్యులర్‌గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. కేసు వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. రాజేంద్రనగర్ లోని హైదర్షాకోట్ విశాల్నగర్లో ఉన్న జనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ లో ఆదివారం రాత్రి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్వోటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇద్దరు నైజీరియన్స్‌తో సహా మొత్తం ఐదుగురు డ్రగ్స్ సప్లయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిలో ఒనౌహ బ్లెస్సింగ్ (31), అజీజ్ నహీం(29), సత్య వెంకట గౌతమ్ (31), ఏపీ అమలాపురానికి చెందిన కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్ (42), బండ్లగూడ జాగీర్‌కు చెందిన కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్(36) ఉన్నారు. వీరి వద్ద నుంచి 200 గ్రాముల కొకైన్, రెండు పాస్‌పోర్టులు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది డ్రగ్స్ కస్టమర్లను గుర్తించారు. వీరంతా సప్లయర్స్ వద్ద నుంచి రెగ్యులర్‌గా డ్రగ్స్ కొంటున్నట్టు నిర్ధారించారు.
రెగ్యులర్ కస్టమర్‌గా అమన్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ రెగ్యులర్‌గా కొకైన్ కొనుగోలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. అమన్ తో పాటు కిషన్ రతి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీచరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్ ధావన్, మధు, రఘు, క్రిష్ణమ్ రాజు, వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్ కంటెంట్ టెస్టులు నిర్వహించారు. అమన్ ప్రీత్ సింగ్, అంకిత్, ప్రసాద్, నిఖిల్ ధావన్‌తో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆరుగురికి నోటీసులు ఇచ్చి రాజేంద్రనగర్ డీసీపీ ఆఫీస్‌లో విచారిస్తున్నారు. అమన్ ప్రీత్ సింగ్ కాంటాక్ట్‌లో ఉన్న వారిలో ఇంకా ఎంత మంది డ్రగ్స్ కస్టమర్లు ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్ చేపడ్తున్నారు. ఇందులో భాగంగా నైజీరియన్స్ డ్రగ్ సప్లయర్స్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలపై నిఘా పెంచారు.
సిండికేట్‌గా డ్రగ్స్ దందా
గతంలో అరెస్టయిన నైజీరియన్స్, ఇతర డ్రగ్ సప్లయర్ల వివరాలు పోలీసులు సేక రించారు. వారిలో నైజీరియన్ డివైన్ ఎబుక సుజీ అలియాస్ అబుక నెట్‌వర్క్ ను ట్రేస్ చేశారు. డివైన్ హైదరాబాద్, ముంబై, బెంగళూర్, ఢిల్లీలో డ్రగ్స్ సిండికే ట్ ఏర్పాటు చేసి ఒనౌహ బ్లెస్సింగ్ అలియా స్ జోన గోమ్స్(31) అనే నైజీరియన్ మహి ళతో డ్రగ్స్ సప్లయ్ చేయిస్తున్నట్లు గుర్తించారు. మరో నైజీరియన్ అజీజ్ నోహీమ్ అదెశోల 2014లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చాడు. ప్రస్తుతం లంగర్ హౌ స్‌లోని సన్‌సిటీలో ఉంటున్నాడు. స్థానికంగా కలేషి అనే డ్రగ్స్ పెడ్లర్‌తో కలిసి కొకైన్ సప్లయ్ చేస్తున్నాడు. అజీజ్ నోహీమ్, క లేషితో విశాఖపట్నానికి చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్ డ్రగ్స్ చైన్ ఆపరేట్ చేస్తున్నాడు. గ్రాముకు రూ.500 కమీష న్ తీసుకుంటూ నైజీరియన్స్ కొకైన్ ను హైదరాబాద్, బెంగళూరు కస్టమర్లకు సప్లయ్ చేసేవాడు. అతని అకౌంట్లలో రూ.13.24 లక్షలు పోలీసులు గుర్తించారు.