రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ.. పబ్లిక్ హాలిడే ప్రకటించిన రాష్ట్రాలివే

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ.. పబ్లిక్ హాలిడే ప్రకటించిన రాష్ట్రాలివే

జనవరి 22న రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' రోజున పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్‌తో సహా రాష్ట్రాలు పబ్లిక్ హాలిడేగా తేల్చి చెప్పాయి. పుదుచ్చేరి, చండీగఢ్ సహా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సెలవు ప్రకటించాయి. కేరళ, అస్సాం, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు సైతం జనవరి 22 న ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్-డేగా ప్రకటించాయి.

రామ మందిరం 'ప్రాణ పతిష్ఠ' (ప్రతిష్ఠాపన) వేడుకల కోసం భారతదేశంలోని అన్ని కార్యాలయాలు, సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు సగం రోజుల సెలవు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి తోడు, 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకను దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు, తద్వారా ప్రజలు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు వీలు కలుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమానికి ముందు జనవరి 15 తెల్లవారుజామున అయోధ్యలోని రామాలయం గర్భగుడిలోకి రామ్ లల్లా ప్రధాన విగ్రహాన్ని తీసుకువచ్చినట్లు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

అంతకుముందు మంత్రోచ్ఛారణల మధ్య 'పరిసార్ ప్రవేశ్' (సముదాయంలోకి ప్రవేశం) కోసం ప్రధాన విగ్రహం ప్రతిరూపాన్ని ప్రతీకాత్మకంగా తీసుకువచ్చారు. ఆ తర్వాత 'జై శ్రీరామ్' నినాదాల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చే ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 22న రామ మందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక జరగనున్న నేపథ్యంలో ఏడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 121 మంది 'ఆచార్యులు' నిర్వహించే ఈ క్రతువులో భాగంగా రామాలయం 'ప్రాణ ప్రతిష్ఠ' మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 22న మధ్యాహ్నం 1 గంటలోపు ముగుస్తుంది.