తలాపున గోదారి పారుతున్నా.. మా ఊరు ఎడారి అన్నట్లుంది: మక్కాన్‌‌ సింగ్‌‌ ఠాకూర్‌‌

తలాపున గోదారి పారుతున్నా.. మా ఊరు ఎడారి అన్నట్లుంది: మక్కాన్‌‌ సింగ్‌‌ ఠాకూర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఎక్కడికి నీళ్లు పోవాలన్నా ఎల్లంపల్లి నుంచే పోవాలని, కానీ.. తమ మిగులు భూములకు మాత్రం నీళ్లు అందడం లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌‌ సింగ్‌‌ రాజ్‌‌ ఠాకూర్‌‌ అన్నారు. శనివారం అసెంబ్లీలో ఇరిగేషన్‌‌ శ్వేతపత్రంపై మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం అప్పటి ఎంపీ వెంకటస్వామి చెప్పిన వెంటనే తెలంగాణకు సాగు నీటికి, హైదరాబాద్‌‌కు తాగు నీళ్లివ్వాలనే ఆలోచనతో తక్కువ రేటుకే రైతులు భూములు ఇచ్చారన్నారు. మిగులు భూములకు నీళ్లు వస్తాయని ఆశించి, సహకరించారన్నారు.

రాష్ట్రం వచ్చాక బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందన్నారు. తమ ఎరియాలో 35 వేల ఎకరాల ఆయకట్టు కోసం అనేక పోరాటాలు చేశామని, అప్పటి మంత్రి హరీశ్​రావును కలిసి రిప్రజెంటేషన్‌‌ ఇచ్చామన్నారు. అప్పటి సీఎం లిఫ్ట్‌‌ కడతామని చెప్పి, ఇప్పటికీ కట్టలేదన్నారు. ‘‘మిగులు భూములకు నీళ్లు ఇవ్వలే.. ఊరు చుట్టూరా నీళ్లే ఉంటాయి.. కానీ, తాగడానికే లేవు. తలాపున పారుతుంది గోదారి.. మా ఊరు, మా చెలక ఎడారి’’ అన్నట్లుంది  మా పరిస్థితి అని వాపోయారు.