- బల్దియా నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ స్పందన
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ నోటీసులపై శనివారం రామానాయుడు (సురేశ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్) స్టూడియోస్ స్పందించింది. తాము జీహెచ్‌ఎంసీ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని, డిమాండ్ నోటీసుల మేరకు ఏటా ట్రేడ్ లైసెన్స్ ఫీజును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.
ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు విధించే విషయంలో జీహెచ్‌ఎంసీనే సమర్థవంతమైన అధికార సంస్థగా గుర్తిస్తున్నామని, అన్ని చట్టపరమైన అంశాలలో సంపూర్ణ మద్దతిస్తామని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ రికార్డుల ప్రకారం.. తమ ఆస్తి పన్నును 68,276 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా ఆధారంగా అంచనా వేసి రెగ్యులర్ గా చెల్లిస్తున్నామని స్పష్టం చేసింది.
ఈ విషయంలో ఏమి దాచిపెట్టలేదని, తప్పుడు నివేదిక ఇవ్వలేదని వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఫీజుని సంవత్సరానికి రూ.7,614 నుంచి రూ.2,73,014 లకు పెంచిందని.. ఈ ఫీజు కూడా ఇప్పటికే చెల్లించామని తెలిపింది. ఒక్కసారిగా అంతగా పెంచడం కరెక్ట్ కాదని తాము అభిప్రాయపడుతున్నామని స్టూడియో తెలిపింది.
