
రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలు, సీరియళ్లు వచ్చినా.. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణానికి ఉన్న క్రేజ్ వేరు. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన ఈ సీరియల్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈవిషయాన్ని దూరదర్శన్ ట్విట్టర్ ( ఎక్స్ ) ద్వారా వెల్లడించింది. రామానంద్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కి్న ఈ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహ్రీ నటించారు.
రామాయణం రీ టెలికాస్ట్ అవ్వడం ఇది రెండోసారి కావడం విశేషం. 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గం.లకు దూరదర్శన్‌లో ఈ సీరియల్ ప్రసారమైంది. ఆ తరువాత కరోనా టైమ్ లో ఈ సీరియల్ ను రీ టెలికాస్ట్ చేయాలంటూ భారీ సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజల కోసం ప్రసారం చేసింది.
మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడే ఎక్కువమంది వీక్షించిన సీరియల్‌గా లిమ్కా బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఆతర్వాత 2020 ఏప్రిల్ 16న 7.7 కోట్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డును నమోదు చేసింది.