హైదరాబాద్, వెలుగు: హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయం దగ్గర సింగరేణి కాలరీస్ఓపెన్ కాస్ట్మైనింగ్ చేయొద్దని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ సీనియర్‌నేత బి. వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక దేవాలయం రామప్ప మాత్రమేనని, గుడికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వెంకటాపురం గ్రామంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను ప్రతిపాదించిందని పేర్కొన్నారు.
19 ఏండ్లపాటు వచ్చే బొగ్గు కోసం 800 ఏండ్ల నాటి రామప్ప దేవాలయాన్ని చరిత్రలో లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రామప్ప దేవాలయం దగ్గర బొగ్గు తవ్వకానికి ఆర్కియాలజీ సంస్థ అనుమతి తప్పనిసరని 2021లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
సింగరేణి ఆ అనుమతిని పక్కన బెట్టి ఏవో సంస్థలు చెప్పాయనే కారణంతో రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్‌కు సిద్ధమవుతోందని తెలిపారు. రామప్ప హెరిటేజ్ సైట్ ప్రాంతాన్ని విస్తరించేందుకు ఫిబ్రవరి 2027లోగా అభిప్రాయం చెప్పాలంటూ ప్రభుత్వానికి యునెస్కో లేఖ రాసిందని గుర్తు చేశారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పుడు కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి హోదాలో సింగరేణి కాలరీస్‌తో మాట్లాడి... రామప్ప వద్ద ఉన్న ఓపెన్‌కాస్ట్ గనుల ప్రతిపాదనను వెంటనే రద్దు చేయించాలని కోరారు.
