- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. సర్కార్ తీరుతో రైతులు గోస పడుతున్నారన్నారు. కొనుగోళ్లలో స్పీడ్ పెంచాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్‌గౌడ్‌తో కలిసి గురువారం భువనగిరి మండలం హన్మాపురంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
లారీలు రాకపోవడంతో పది రోజులుగా కాంటా కావడం లేదని, టార్పాలిన్లు సైతం ఇవ్వలేదని రైతులు చెప్పారు. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. . వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల కోసం కేంద్రమే డబ్బులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
రైస్ మిల్లర్లు, దళారులు, ఆఫీసర్లు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్ల వేధింపుల కారణంగానే నల్గొండ జిల్లా బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇన్‌చార్జి కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ఆదిలాబాద్‌లో మక్క రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, మద్దతు ధర దేవుడెరుగు కనీసం కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రతి గింజను కొనాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట రాష్ట్ర కార్వవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, వేముల అశోక్, పడమటి జగన్మోహన్‌రెడ్డి, చందా మహేందర్ గుప్తా ఉన్నారు.

