- ఫామ్-6, 7పై పనిగట్టుకుని అబద్ధాలు చెప్తున్నారన్న బీజేపీ స్టేట్ చీఫ్
హైదరాబాద్, వెలుగు: 13 కోట్ల ఓట్లు అక్రమంగా తొలగించారని కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడుతున్నారని, దమ్ముంటే అందుకు ఆధారాలు చూపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు ఎన్నికల సంఘం, బీజేపీపై ప్రజల్లో తప్పుడు సమాచారం, అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ మీడియాతో మాట్లాడారు. ఫామ్-6, 7 అంశాలపై ఈసీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, అయినా దానికి ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.
చనిపోయినోళ్ల ఓట్లు ఉంచాలా..
దేశవ్యాప్తంగా 2.8 కోట్ల మంది మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని, మరి చనిపోయిన వారి పేర్లను ఓటరు లిస్టులో అలాగే ఉంచాలా.. తొలగించాలా? అనేదానికి రాహుల్ సమాధానం చెప్పాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు ఓట్ల చోరీయే నిజమైతే.. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఓట్ల చోరీతోనే ఏర్పాటయ్యాయా? అని ప్రశ్నించారు.
1952 నుంచి 2014 వరకు దేశంలో 12 సార్లు సర్ ప్రక్రియ జరిగిందని, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఆ లెక్కన సర్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ అక్రమ ప్రభుత్వాలేనని ఆ పార్టీ ఒప్పుకుంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల సంఘం గొప్పదని, ఓడిపోతే మాత్రం ఈసీ, ఈవీఎంలపై బురదజల్లడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
నాడు బోగస్ ఓట్లు అన్నది మీరే కదా
2018లో తెలంగాణలో 70 లక్షల ఓట్లలో అవకతవకలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ అన్నారని, స్వయంగా రాహుల్ గాంధీయే ఫేక్, బోగస్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ గుర్తుచేశారు. మధ్యప్రదేశ్‌లో 60 లక్షల బోగస్ ఓట్లున్నాయని కమల్‌నాథ్, రాజస్తాన్‌లో 45 లక్షల డూప్లికేట్ ఓట్లున్నాయని సచిన్ పైలట్ చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అప్పుడు మీరే తొలగించాలని చెప్పిన నకిలీ ఓట్లను ఇప్పుడు ఈసీ బాధ్యతాయుతంగా క్లీన్ చేస్తుంటే కాంగ్రెస్‌కు ఉలుకెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాక్సిడెంట్లతో కుటుంబాలు రోడ్డున పడుతున్నయ్
పద్మారావునగర్/మల్కాజ్‌గిరి, వెలుగు : పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రమాదాల నివారణకు ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాంచందర్ రావు అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం, 25 ఏండ్ల ప్రజాపాలనను పురస్కరించుకుని మంగళవారం మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం మల్కాజ్‌గిరి బిహార్ బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్ మిలాన్ సేవా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు స్కూల్బ్యాగులు, బుక్స్, విద్యా సామగ్రి పంపిణీ చేశారు.
