- ఎంఐఎం గెలుపు కోసమే జీహెచ్ఎంసీని ముక్కలు చేశారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కై పంచుకుతింటున్నాయనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్.. ఈ రెండు పార్టీల స్టీరింగ్ మజ్లిస్ చేతిలోనే ఉందన్నారు. మంగళవారం ఆయన కూకట్‌పల్లిలో ఆ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీని విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వెనుక మజ్లిస్ ప్రయోజనాలు ఉన్నాయని రాంచందర్ రావు ఆరోపించారు.
నగరాన్ని ముక్కలు చేస్తే తప్ప మజ్లిస్ గెలవలేని పరిస్థితి ఉందని, అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అశాస్త్రీయంగా నగరాన్ని విభజించి, ఓ భాగాన్ని మజ్లిస్‌కు దారాదత్తం చేయాలని చూస్తోందని చెప్పారు. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కాంగ్రెస్ సర్కార్ వసూళ్లే కారణమని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమిషన్ల దందా 30 శాతంగా ఉంటే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఏకంగా 40 శాతానికి పెంచేశారని చెప్పారు.
పేదలకు ఇళ్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే బాటలో నడుస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ముంచితే.. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లంటూ వంచిస్తున్నారన్నారు. నగర అభివృద్ధి కేవలం మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమన్నారు. కేంద్రం ఇస్తున్న అమృత్, స్మార్ట్ సిటీ నిధులతోనే ఇక్కడ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధిని కోరుకునే బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
