మీరే భూస్థాపితం అయితరు : రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

మీరే భూస్థాపితం అయితరు :  రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
  • బీజేపీని బొందవెట్టుడు ఎవరి తరం కాదు: రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
  • ఫ్యూచర్ సిటీ కడతమని ఎవరిని అడిగిర్రు.. కేంద్రం డబ్బులు ఎట్ల ఇస్తదని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: బీజేపీని భూస్థాపితం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, ప్రజలే కాంగ్రెస్ పార్టీని పాతరేయడం ఖాయమని బీజేపీ స్టేట్​చీఫ్​ రాంచందర్ రావు మండిపడ్డారు. బీజేపీని భూస్థాపితం చేయడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హెల్త్, ఎడ్యుకేషన్ వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విషయంలోనూ అన్యాయం చేయలేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ‘‘ఫ్యూచర్ సిటీ కడతమని ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నరు? మీ సొంత నిర్ణయాలకు కేంద్రం నిధులు ఎట్లా ఇస్తది?’’ అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని బొందపెడతామని సీఎం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతి బినామీల పేరు మీద జరిగిందని, ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చిన ‘సంచార్ సాథి’ యాప్​పై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నంబర్ వన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్‌‌పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు మంజుల, బండారు రవీందర్,బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నగేశ్ తదితరులు బీజేపీలో చేరారు.

సీఎం వ్యాఖ్యలపై నిరసనలకు పిలుపు

హిందూ దేవుళ్లను, హిందూ సమాజాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని.. దీన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని రాంచందర్​ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ‘యాంటీ–హిందూ’గా మారిపోయిందన్నారు.  గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే వ్యవహరించిందని అన్నారు. దీనికి సీఎం రేవంత్,కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.