వ్యూహం కథేంటి..మూవీ వెనుక ఎవరున్నారు.. రామ్ గోపాల్ వర్మ మాటల్లో..

వ్యూహం కథేంటి..మూవీ వెనుక ఎవరున్నారు.. రామ్ గోపాల్ వర్మ మాటల్లో..

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్పై వరుసగా సినిమాలు తీస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ పేర్లతో సినిమాలు రూపొందించి ఏపీ పాలిటిక్స్లో సంచలనం సృష్టించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కథతో వ్యూహం అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజీపై జరుగుతోంది. 

వ్యూహం కథేంటి..?

వ్యూహం సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర నుంచి మొదలవుతుందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. రెండు భాగాలు ఎన్నికలకు ముందే విడుదల చేస్తామన్నారు. వైఎస్ మరణం తరువాత జరిగిన పరిణామాలు, ఎవరెవరు వ్యూహాలు పన్నారో..ఈ చిత్రం ద్వారా  చెబుతామన్నారు. ఈ చిత్రంలో వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా ఉంటుందన్నారు. వివేకానంద హత్య కేసులో నిందితులను  తాను చూపిస్తానని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డిని తాను  దగ్గర నుంచి చూశానని..ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ లతో పాటు భారతి పాత్ర కూడా ఉంటుందన్నారు. 

వ్యూహం వెనుక ఎవరున్నారంటే..

ఎవరు ఎలాంటి సినిమాలు తీసినా తనకు అవసరం లేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుందని చెప్పారు. ఏపి రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయని..రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ఘట్టాలు ఇందులో ఉంటాయన్నారు. తాను జగన్ కు అభిమాని అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కానీ తనకు ఎవరి పైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఇచ్చే వాళ్లు ఉంటే... హీరోలు  ఎంతైనా రెమ్యూనరేషన్  తీసుకోవడంలో తప్పు లేదన్నారు. ఎవరికి ఎంత అనేది మార్కెట్ ను బట్టి నిర్మాత చూసుకుంటారని చెప్పారు. వ్యూహం సినిమా వెనుక దాసరి కిరణ్ తప్ప మరెవరూ లేరన్నారు. తమతో గానీ..లేదా తమ గురించి కానీ సినిమా తీయాలని  పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు పిలిచి అడిగినా దర్శకత్వం చేయనని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.

వ్యూహం మూవీని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతీగా మానస నటిస్తున్నారు.