వడ్ల స్కామ్ ఆధారాలుంటే బయటపెట్టండి...రామ్మోహన్ రెడ్డి

వడ్ల స్కామ్ ఆధారాలుంటే బయటపెట్టండి...రామ్మోహన్ రెడ్డి

కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి చర్చకు రావాలి

హైదరాబాద్, వెలుగు : సివిల్ సప్లయ్స్​లో కరప్షన్ జరిగిందని ఆరోపిస్తున్న ఆ రెండు బీబీ (బీజేపీ, బీఆర్ఎస్) పార్టీలు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని పీసీసీ మీడియా కమిటీ కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్​చేశారు. ఆ రెండు పార్టీల నేతలు ఇష్టారీతిన లెక్కలు చెప్తున్నారని.. ఒక పార్టీ రూ.1,100 కోట్ల అవినీతి జరిగిందని అంటుంటే.. మరో పార్టీ రూ.600 కోట్లు అని అంటున్నదని ఆయన విమర్శించారు.

కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి దగ్గర ఆధారాలుంటే బయట పెట్టి.. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. సన్న బియ్యం ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ కు సన్న బియ్యం ఇవ్వాలని ఇప్పటికే  నిర్ణయించిందన్నారు. కేటీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై పదేండ్లు స్కామ్ లు చేశారు కాబట్టే ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.