చేసేది ఈఎన్సీ ఉద్యోగం.. తీసుకునేది డీఈఈ జీతం!

చేసేది ఈఎన్సీ ఉద్యోగం.. తీసుకునేది డీఈఈ జీతం!
  •     ఆర్ అండ్ బీ శాఖలో పేరుకే ప్రమోషన్లు.. టెక్నికల్​గా అందరూ ఒక్కటే
  •     రాష్ట్ర విభజన పూర్తై పదేళ్లు దాటినా ఏపీతో తెగని పంచాయితీ 
  •     రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సీనియారిటీ లిస్ట్ ఫైనల్ చేసేదాకా ఇన్​చార్జ్​ల పేర్లతోనే ప్రమోషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటింది. అయినా ఆర్ అండ్ బీ ఉద్యోగుల విషయంలో ఏపీతో పంచాయితీ తెగట్లేదు. ఈ శాఖలో ఉద్యోగుల ప్రమోషన్ల సీనియారిటీ లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో ఇంజినీర్లు పదోన్నతులు లేకుండా ఇన్​చార్జ్ లుగా పనిచేస్తున్నారు. చేసేది ఈఎన్సీ.. చీఫ్​ ఇంజినీర్​ వంటి ఉన్నత ఉద్యోగం అయినా జీతం తీసుకునేది మాత్రం డీఈఈ క్యాడర్ పోస్టుదే. 

దీంతో పేరుకే ప్రమోషన్లు అన్నట్టుగా ఉంది. పెరిగిన జీత భత్యాలు, ఇంక్రిమెంట్లు, ఇతరత్రా ప్రభుత్వం తరఫున రావాల్సిన డబ్బులు తీసుకోకుండానే ఇప్పటికే కొందరు రిటైర్ అయ్యారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా ఈ విషయంలో గందరగోళ పరిస్థితులు మారట్లేదు. ఎప్పుడు  సీనియారిటీ లిస్ట్ ఫైనల్ చేస్తారో అని ఏళ్ల తరబడి ఇంజినీర్లు ఎదురుచూస్తున్నారు.

ఆర్ అండ్ బీ శాఖలో 3,311 పోస్టులు

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో 3,311 పోస్టులు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఇందులో ఒకటి ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్టు, ఆరు సివిల్, ఒకటి ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజినీర్(సీఈ)​, ఒకటి డిప్యూటీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఎస్ఈ క్యాడర్), 29 సివిల్, రెండు ఎలక్ట్రికల్ సూపరిండెంట్ ఇంజినీర్(ఎస్​ఈ)​, 11 సివిల్, ఒకటి ఎలక్ట్రికల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇతరత్రా అన్నీ కలిపి మొత్తం 3,311 పోస్టులు కేటాయించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పోస్టుల్లో కలిపి ప్రస్తుతానికి 2,448 మంది పని చేస్తుండగా ఇంకా 923 ఖాళీలు ఉన్నాయి. 230 ఏఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా ప్రభుత్వ పరంగా రెగ్యులర్​ ప్రమోషన్లు ఇస్తే మరో 60, 70 ఖాళీ పోస్టులు పెరుగుతాయని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అందరూ ఇన్​చార్జ్​లే.. అంతా ఒక్కటే క్యాడర్​!

ఆర్ అండ్ బీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పోస్టింగ్స్ పరిశీలిస్తే డీఈఈ ఆపై స్థాయిలో ఉన్న వారంతా ఇన్​చార్జ్ లుగా పనిచేస్తున్నవారే ఉన్నారు. టెక్నికల్ చూస్తే అంతా ఒక్క క్యాడర్​కు చెందినవారే. అతి ముఖ్యమైన ఇన్​చార్జ్ ఇన్ చీఫ్, 5 చీఫ్ ఇంజినీర్​(సీఈ), 20 సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్​ఈ), 8 డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్, 59 ఈఈ పోస్టులలను ఇన్​చార్జ్ లుగానే నియమించారు. 

కొందరు ఇంజినీర్లు రెండు, మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ లిస్ట్ ఫైనల్ కాకపోవడం వల్ల వీరందరినీ ప్రభుత్వం ఇన్​చార్జ్ లుగా నియమించాల్సి వచ్చింది. అయినా వీరందరికి పనిచేస్తున్న రెగ్యులర్ క్యాడర్ పోస్టులకు ఇచ్చేవిధంగా జీత భత్యాలు చెల్లించడం లేదు. డీఈఈ క్యాడర్​ పోస్టు ప్రకారమే జీతాలు అందుకుంటున్నారు.

ఏపీతో తెగని పంచాయితీ

తెలంగాణ, ఏపీ వేరుపడినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రిక్రూట్​మెంట్ జరిగిన ఉద్యోగాలు కనుక, రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ లు కలిసి సీనియారిటీ లిస్టులు ఫైనల్​ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగుల రిజర్వేషన్లు, కోర్టు కేసులు తదితర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. 

ఆ తర్వాతే ప్రభుత్వం రెగ్యులర్​ ప్రమోషన్లు ఇవ్వడానికి వీలవుతుందని వివరిస్తున్నారు. ఇప్పటికైనా సీనియారిటీ లిస్ట్ ఫైనల్​చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సర్వీస్​లో ఉన్న ఇంజినీర్లు విజ్ఞప్తిచేస్తున్నారు.