అనర్హులకు ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ!

అనర్హులకు ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ!
  • ఎస్ఆర్​పీ ఓసీపీ భూసేకరణలో అక్రమాలు
  • బీఆర్ఎస్​ లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్లు కుమ్మక్కు
  • దుబ్బపల్లిలో 168 ఇండ్లకు గాను 103గా గుర్తింపు
  • తప్పులతడకగా సోషల్​ఎకనామిక్ ​సర్వే
  • మరోసారి సర్వే చేయాలని నిర్వాసితుల డిమాండ్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ​ప్రాజెక్టు(ఎస్ఆర్ పీ ఓసీపీ)పరిధిలోని భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ చెల్లింపులో భారీ అక్రమాలు జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జైపూర్ మండలం రామారావుపేట అనుబంధ గ్రామమైన దుబ్బపల్లి వరకు ఓసీపీని విస్తరిస్తున్నారు. భూనిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం ప్యాకేజీ చెల్లించేందుకు రెండేండ్ల కిందట ఎస్ఈఎస్(సోషల్ ఎకనామిక్ సర్వే) నిర్వహించారు. అప్పటి అధికార బీఆర్ఎస్​ పార్టీకి చెందిన కొందరు లీడర్లు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అనర్హులను నిర్వాసితుల లిస్టులో చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దుబ్బపల్లికి చెందిన పలువురు కలెక్టర్ తోపాటు సీసీఎల్ఏ(చీఫ్​ కమిషనర్ ​ఆఫ్ ​ల్యాండ్​అడ్మినిస్ట్రేషన్)కు ఫిర్యాదు చేశారు. దాంతో నష్టపరిహారం, ఆర్​ అండ్​ఆర్​ప్యాకేజీ చెల్లింపునకు బ్రేక్ పడింది. కానీ అధికారులు అనర్హులను తొలగించలేదు. బాధితులు ఈ నెల 5న మరోసారి జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

సగం మంది అనర్హులే..

దుబ్బపల్లి గ్రామంలో మొత్తం168 ఇండ్లు ఉండగా, అధికారులు సోషల్ ఎకనామిక్​సర్వేలో103 ఇండ్లనే గుర్తించారు. ఇందులో 64 మంది అనర్హులున్నారని నిర్వాసితులు కలెక్టర్​కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్​కు చెందిన కొందరు లీడర్లు ఇతర ప్రాంతాలకు చెందిన తమ బంధువులను, దగ్గరి వ్యక్తులను ​లిస్టులో చేర్పించారని ఆరోపించారు. తాత్కాలిక షెడ్లు నిర్మించి వాటికి హౌస్​నంబర్లు తీసుకొని, దుబ్బపల్లిలోనే ఉంటున్నట్టుగా క్రియేట్​చేశారని తెలిపారు. తాతలు తండ్రుల కాలం నుంచి దుబ్బపల్లిలో ఉంటున్నవారి పేర్లు తొలగించి అర్హులకు అన్యాయం చేశారని వాపోయారు. బీఆర్ఎస్ లీడర్లు కొందరు, భూసేకరణ అధికారులు కుమ్మక్కై సర్వేను తప్పులతడకగా చేశారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. అప్పటి మంచిర్యాల ఆర్డీఓ దాసరి వేణు, ఆర్డీఓ ఆఫీసులోని భూసేకరణ విభాగంలో పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్​ కమల్​సింగ్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ లీడర్లతో కలిసి ఒక్కో ఇంటికి రూ.80వేల చొప్పున 100 మంది వద్ద పైసలు వసూలు చేశారని ఆరోపించారు. రీసర్వే నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ తహసీల్దార్ కమల్​సింగ్ ఇటీవల జైపూర్​మండలానికి ట్రాన్స్​ఫర్ అయ్యారు. ఆయనపై ఫిర్యాదు చేసిన తమపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు నిర్వాసితులు కలెక్టర్​కు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కమల్​సింగ్​ను జైపూర్ ​నుంచి బదిలీ చేసి రీసర్వే చేయిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని వేడుకున్నారు.

ఎంతెంత అంటే?

నష్టపరిహారంతోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి పునరావాస కాలనీలో 270 గజాల ఫ్లాట్​రావాల్సి ఉంది. కుటుంబంలో ఎంతమంది మేజర్లు ఉంటే అంత మందికి ఫ్లాట్లు ఇవ్వనున్నారు. అలాగే భూనిర్వాసితుల పరిహారం కింద భార్య, భర్త, పిల్లలకు కలిపి ఒక్కొక్కరికి రూ.2.40 లక్షల చొప్పున పరిహారం రావాల్సి ఉంది.