- బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను మోసం చేశారని, ఆ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి విమర్శించారు. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రూ.100 కోట్లకు టికెట్ కొనుక్కున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారని సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాకు తెలిపారు. నేతలు పార్టీలు మారడం సాధారణమే అయినప్పటికీ, వెన్నుపోటు పొడిచి, మోసం చేసి పార్టీ మారిన కోవలోకి రంజిత్‌రెడ్డి వస్తారని కార్తిక్ రెడ్డి ఆరోపించారు. ఐదేండ్లకింద రంజిత్‌రెడ్డి అంటే ఎవరికీ తెల్వదన్నారు.
కేసీఆర్ ఆయనను తీసుకొచ్చి ఫౌల్ట్రీ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌ను ఆపై ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. రంజిత్ రెడ్డి తమ ప్రాంతంవాసి కాకపోయినా, కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవించి గెలిపించుకున్నామన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీ మారి నయవంచన చేశారని ఫైర్ అయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని హెచ్చరించారు.
