
ఇప్పటి వరకు బాబాలు ఆశ్రమాలు పెట్టడం చూసుంటారు.. కానీ ఓ దేశాన్నే స్థాపించిన బాబా గురించి విన్నారా? రేప్ కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద భారత్ నుంచి పరారై.. ఓ సొంత దేశాన్నే స్థాపించాడు. ఆ దేశం పేరు కైలాసం. ఈ పేరు వినగానే హిమాలయాల్లో ఉన్న కైలాస శిఖరం అనుకునేరు.. అది కాదు. దక్షిణ అమెరికా తీరానికి సమీపంలో ఉన్న కంట్రీ ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసి.. అక్కడి స్థాపించాడీ దేశాన్ని. దానికి కైలాసం అని పేరు పెట్టాడు.
అహ్మదాబాద్‌లో ఫైల్ అయిన రేప్ కేసులో పరారీలో ఉన్న నిత్యానంద కోసం భారత పోలీసులు వెతుకుతున్నారు. ఇటీవలే కొద్దిరోజుల క్రితం దేశం వదిలి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. నేపాల్ మీదుగా ఈక్వెడార్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
కైలాసం వెబ్‌సైట్ ఆధారంగా..
కైలాసం అనే పేరుతో వెబ్‌సైట్ పెట్టి.. సొంత దేశాల్లో హిందూ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకోలేకపోతున్న వాళ్లందరికీ స్వాగతం అని అందులో పెట్టారు. అయితే ప్రస్తుతానికి అధికారికంగా ఆ దేశం ఎక్కడుందో ప్రకటించలేదు. కానీ పౌరసత్వం తీసుకోవచ్చంటూ kailaasa.org వెబ్‌సైట్‌లో లింక్ కూడా పెట్టేశారు.
మరిన్ని విశేషాలు..
-
దేశం పేరు కైలాస.. ది గ్రేటెస్ట్ హిందూ నేషన్ అనేది ట్యాగ్ లైన్.
-
అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమం నుంచి కొందరు కీలక వ్యక్తులు ఈ కొత్త కైలాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వాళ్లే ఆ దేశానికి ప్రధాన పదవుల్లో ఉంటారని సమాచారం.
-
ప్రపంచ వ్యాప్తంగా నిత్యానందకు ఉన్న అపర కుబేరులైన భక్తులు, ఈక్వెడార్‌లోని పవర్‌ఫుల్ వ్యక్తులతో కలిసి ఈ దీవిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.
-
ఆ దేశానికి నిత్యానందనే రాజు. అక్కడ హిజ్ డివైన్ హోలీనెస్ (HDH) భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం పేరుతో చలామణి అవుతాడట. వివిధ శాఖల వారీగా ఆఫీసుల వివరాలను కూడా వెబ్ సైట్‌లో ఉంచారు.
-
ఆ దేశం పౌరసత్వం పొందాలంటే అక్కడి ప్రధానమంత్రి, కేబినెట్ ఆమోదం పొందాలట. నిత్యానందకు డొనేషన్లు, భక్తిగా పూజిస్తారని నమ్మితేనే సిటిజన్‌షిప్ అప్లికేషన్‌కు వాళ్లు ఆమోద ముద్ర వేస్తారు.
-
అక్కడ ప్రధానిగా ఓ కోలీవుడ్ నటిని నిత్యానంద నియమించాడని, కేబినెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం.
-
జాతీయ జెండా, జాతీయ చిహ్నాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో పెట్టారు. జాతీయ జంతువు నంది, పువ్వు తామర, చెట్టు మర్రి, పక్షి శరబం. ఇక అధికారిక బాషలు ఇంగ్లిష్, సంస్కృతం, తమిళం.
-
నిత్యానందనే శివుడి అవతారంలో ఉన్న ఫొటోను, నంది బొమ్మను ఆ దేశ జెండాలో పెట్టారు.
-
ఒకప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో హిందూ మతం విస్తరించిందని, కానీ ఇప్పుడు ఆయా దేశాల్లో సనాతన ధర్మాన్ని అచరించలేకపోతున్న వాళ్లంతా ఈ దేశానికి రావచ్చని సైట్‌లో ఉంది. హిందూ మతానికి పూర్వ వైభవాన్ని తెస్తానని అందులో రాశారు. ప్రపంచంలోని హిందువులందరికీ సర్వజన పీఠం అదేనట.
-
ఈ సైట్‌ను 2018 అక్టోబర్ 21న ప్రారంభించి, 2019 అక్టోబర్ 10న చివరిగా అప్‌డేట్ చేసినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. పనామాలో రిజిస్టర్ చేశారని, ఐపీ అడ్రస్ అమెరికాలోని డల్లాస్‌లో లొకేట్ అయి ఉన్నట్లు తెలిపారు.