
మాజీ రాజ్యసభ ఎంపీ రాపోలు అనందభాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డాకు పంపించారు. రాజీనామా లేఖలో రాపోలు... పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేండ్లలో పార్టీ నాయకత్వం తనని విస్మరించిందని ఆరోపించారు. తనను ఎన్నోసార్లు అవమానించారని, తక్కువ చేసి చూశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో తనకి ప్రాధాన్యం లేకుండా చేసినా ఆవమానాలను దిగమింగుతూనే వచ్చానన్నారు. ఇటీవలే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయన రాబోయే 3 రోజుల్లో టీఆర్ఎస్ లో చేరే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి.
జర్నలిస్ట్ గా పనిచేసిన ఆనంద భాస్కర్ రావు 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి.. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు.