Rashid Khan: ఒకే ఫార్మాట్ లో 650 వికెట్లు.. టీ20 నెంబర్ వన్ బౌలర్‌గా ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్

Rashid Khan: ఒకే ఫార్మాట్ లో 650 వికెట్లు.. టీ20 నెంబర్ వన్ బౌలర్‌గా ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్

టీ20 క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ను పోటీ పడి మరీ తీసుకుంటారు. దశాబ్ద కాలానికి పైగా టీ20 క్రికెట్ లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికీ రషీద్ స్పిన్ బ్యాటర్లకు ఒక సవాలే. తన స్పిన్ మాయాజాలంతో టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న రషీద్ ఖాన్.. తాజాగా టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసుకొన్న బౌలర్ గా రికార్డులకెక్కిన రషీద్.. ఈ ఫార్మాట్ లో మరో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పాడు. 

టీ20 ఫార్మాట్ లో 650 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రషీద్ ఖాన్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. మంగళవారం (ఆగస్టు 5) లార్డ్స్‌లో జరిగిన ది హండ్రెడ్ లీగ్ తొలి మ్యాచ్ లో ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరఫున ఆడుతున్న రషీద్ లండన్ స్పిరిట్‌పై మూడు వికెట్లు పడగొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు.  వేన్ మాడ్సెన్, లియామ్ డాసన్, ర్యాన్ హిగ్గిన్స్‌లను ఔట్ చేసి ప్రత్యర్థి జట్టు 80 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు. ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో రషీద్ ఖాన్ 478 ఇన్నింగ్స్‌ల్లో 18.54 సగటుతో 651 వికెట్లు పడగొట్టాడు.

582 మ్యాచ్‌ల్లో బ్రావో 631 వికెట్లతో రెండో స్థానంలో.. 589 వికెట్లతో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (547), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (498) వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 26 ఏళ్ల ఈ రషీద్ ఖాన్ ఇటీవలే జరిగిన ఐపీఎల్ సీజన్ 2025లో పెద్దగా రాణించలేదు. 15 మ్యాచ్‌లలో 57.11 సగటుతో 9 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఐపీఎల్ లో విఫలమైనా హండ్రెడ్ లీగ్ లో ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ఫామ్ లోకి వచ్చాడు.