వడ్లు కొంటలేరని రాస్తారోకోలు

వడ్లు కొంటలేరని రాస్తారోకోలు

రామాయంపేట/భీంగల్​/రామడుగు/ గండీడ్​, వెలుగు:వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తుండడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. మెదక్​జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో వడ్లను కొనుగోలు చేయాలంటూ శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. రామాయంపేట, గజ్వేల్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడ్లను స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులైనా కాంటా పెట్టలేదని, రెండుసార్లు వర్షానికి తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కొనుగోళ్లు పూర్తిగా బంద్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వడ్లను కొనుగోలు చేయడంతో పాటు కాంటా పెట్టిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకొన్న  ఎస్సై రాజేశ్​అక్కడకు చేరుకొని రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. పది రోజులుగా గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ నిజామాబాద్‌ జిల్లా భీంగల్ మండలం పురాణిపేట్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం భీంగల్ కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, సొసైటీ ఆఫీసర్లు, తహసీల్దార్​ రాజేందర్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. నాలుగు రోజుల్లో వడ్లు కొనుగోలు చేయించడంతోపాటు పురాణిపేట్ గ్రామానికి మూడు లారీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయిస్తానని తహసీల్దార్​హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కరీంనగర్​జిల్లా రామడుగు ప్యాక్స్​సెంటర్​లో కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు అంబేద్కర్​ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. వడ్లను సెంటర్​కు తీసుకువచ్చి రోజులు గడుస్తున్న కాంటా వేయకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కుప్పలు కూడా సీరియల్​నంబర్ ప్రకారం కాకుండా పైరవీకారులవే తూకం వేస్తున్నారని ఆరోపించారు. సెంటర్​లో  సీరియల్ ప్రకారం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్​ చేశారు. 

అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా

మహబూబ్​నగర్​ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్ రెడ్డి పల్లి గేటు దగ్గర ఉన్న కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో క్వింటాలుకు రెండు కిలోలు అదనంగా వచ్చేలా కాంటాలో సెట్టింగ్​చేశారు. మోసాన్ని గుర్తించిన రైతు తిరుపతి రెడ్డి ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో గురువారం సాయంత్రం తనిఖీలు చేశారు. ఎలక్ట్రిక్​కాంటాను సీజ్​చేసి తీసుకెళ్లారు. శుక్రవారం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు మహబూబ్​నగర్ – చించోలి అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నాకు దిగారు. కిలోమీటర్ల మేర వెహికల్స్​నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మండలంలో ఇప్పటికే 4 వేల టన్నుల వడ్లు కొన్నారని, క్వింటాలుకు రెండు కేజీల చొప్పున నొక్కేసి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్​ఆధ్వర్యంలో కేంద్రాన్ని నిర్వహిస్తామని, కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆఫీసర్లు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. 

ధర్మారం, భీంగల్, రామడుగులో రోడ్డెక్కిన రైతులు