లబ్ధిదారులకు చెప్పరు... గోధుమల గుట్టు విప్పరు.. పంపిణీ తేదీ ముగియడంతో డీలర్ల తికమక

లబ్ధిదారులకు చెప్పరు... గోధుమల గుట్టు విప్పరు.. పంపిణీ తేదీ ముగియడంతో డీలర్ల తికమక
  • మార్చిలో 3 నెలల రేషన్​పంపిణీ
  • ఒకే నెల గోధుమలు ఇచ్చిన పౌరసరఫరాల శాఖ
  • మిగతా రెండు నెలలపై సప్పుడు చేయలే
  • ఈ నెల చెప్పకుండా రేషన్​షాపులకు గోధుమలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా రేషన్​షాపులకు పంపించిన గోధుమ నిల్వలు అక్కడే మగ్గిపోతున్నాయ్. ఎండాకాలంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలని గత మార్చి నెలలో ఒకేసారి మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేశారు. గోధుమలు మాత్రం ఏప్రిల్ నెలది మాత్రమే ఇచ్చారు. 3 నెలల కోటాను ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. 

కానీ, ఏమైందో ఏమో కానీ, లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా మే నెలలో కోటాను డీలర్లకు పంపించేశారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి15వ తేదీ వరకు రేషన్​సరుకులు పంపిణీ చేస్తుంటారు. ఇప్పటికే గడువు ముగియడం, మూడు నెలల సరుకులను ఇప్పటికే తీసుకున్న లబ్ధిదారులు మళ్లీ జూన్​లోనే అనుకుని గమ్మున ఉన్నారు. 

దీంతో గోధుమలు రేషన్​షాపుల్లోనే మగ్గుతున్నాయ్​. ఐదు రోజుల్లో జూన్​నెల కూడా మొదలవుతుండడంతో మరో కోటా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, మే నెల కోటా గురించి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక రేషన్​డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.  

డీలర్ల వద్ద మూలుగుతున్న నిల్వలు

నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో నెలకు ఒక్కో కార్డుదారుకు 5 కిలోల చొప్పున గోధుమలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన అధికారులు రేషన్​డీలర్ల కు పంపిణీ చేసిన 8లక్షల మెట్రిక్​ టన్నులు అలాగే ఉన్నాయ్​. సిటీలో రేషన్​ పంపిణీపై ఉన్నతాధికారులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని డీలర్లు అంటున్నారు. 

మళ్లీ మూడు నెలలా ? 

వేసవి ప్రారంభంలో 3 నెలల బియ్యం ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు వాటిని నిల్వచేసుకోవడానికి ఇండ్లలో స్థలం లేదని , అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ బియ్యం వ్యాపారులకు చేరి అక్కడి నుంచి మిల్లర్లకు..అక్కడ రీసైకిల్​చేసి బహిరంగ మార్కెట్​లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వర్షాకాలం అనే పేరుతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్​ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను కూడా జూలైలోనే ఇవ్వనున్నట్టు సమాచారం.