సమ్మెలో డీలర్లు..  రేషన్​ బంద్

సమ్మెలో డీలర్లు..  రేషన్​ బంద్
  • సమ్మెలో డీలర్లు..  రేషన్​ బంద్
  • రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన బియ్యం పంపిణీ..
  • డీలర్ల సమ్మె నోటీసుపై స్పందించని సర్కారు
  • మూడు నెలలుగా కమీషనూ ఇస్తలే
  • ఈ నెల 3 నుంచి షాపులు బంద్​పెట్టి నిరసన తెలుపుతున్న డీలర్లు
  • రేషన్​ కోసం వచ్చి వెనుదిరుగుతున్న పబ్లిక్​

మహబూబాబాద్/రాజన్న సిరిసిల్ల, వెలుగు:  డీలర్లు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్​షాపులు మూతపడ్డాయి. తమ సమ్మె నోటీసుపై సర్కారు నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 3వ తేదీ నుంచే రేషన్​డీలర్లు ఊరూరా షాపులు బంద్​పెట్టి నిరసన తెలుపుతున్నారు. డిమాండ్లను పరిష్కరించేదాకా షాపులను తెరిచే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. డీలర్ల సమ్మె కారణంగా ఈ నెల1 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బియ్యం పంపిణీ నిలిచిపోయింది. విషయం తెలియక ఫస్ట్​ తారీఖు నుంచే  రేషన్​ కోసం వస్తున్న పేదలు, షాపులు  తెరవకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. 

మూడు నెలలుగా కమీషన్ ​పెండింగ్​

రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 17,283 రేషన్​షాపులున్నాయి. ఒకప్పుడు రేషన్​షాపుల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, చెక్కర, కందిపప్పు, కిరోసిన్ లాంటి నిత్యవసర సరుకులు సబ్సిడీపై పంపిణీ చేసేవారు. వీటన్నింటిపైనా డీలర్లకు కమీషన్​ వచ్చేది. క్రమంగా మిగిలిన సరుకుల పంపిణీ బంద్​పెట్టిన సర్కారు ప్రస్తుతం బియ్యం మాత్రమే సప్లై చేస్తోంది. దీంతో డీలర్లకు కమీషన్​ తగ్గిపోయింది. జాతీయ ఆహార భద్రత చట్టం(2015) అమల్లోకి రాకముందు రేషన్ బియ్యంపై ప్రతి క్వింటాల్ కు రూ. 20 చొప్పున డీలర్లకు కమీషన్ వచ్చేది. జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లోకి  వచ్చిన తర్వాత ఈ కమీషన్  రూ.70కి పెరిగింది.

ఇందులో కేంద్రం రూ.35, రాష్ట్రం రూ.35 చొప్పున చెల్లించాలి. 2022 మార్చిలో కేంద్ర ప్రభుత్వం క్వింటాల్​కు అదనంగా మరో రూ.20 కమీషన్​ పెంచింది. దీని ప్రకారం కేంద్రం రూ.40, రాష్ట్రం రూ.40 చొప్పున ప్రతి నెలా రూ.80 అందజేయాలి. కానీ పెంచిన కమీషన్​ను  రాష్ట్రప్రభుత్వం 14 నెలలుగా డీలర్లకు చెల్లించడంలేదు. ప్రస్తుతం పాత లెక్కనే క్వింటాల్​కు రూ.35 చొప్పున చెల్లిస్తోంది. ఆ మొత్తం కూడా రెండు, మూడు నెలలకోసారి ఇస్తోందని, షాపుల రెంట్​, కరెంట్ చార్జీలు పెరిగినందున సర్కారు ఇచ్చే కమీషన్​ ఏమూలకూ చాలడం లేదని డీలర్లు వాపోతున్నారు.

రేషన్​డీలర్ల డిమాండ్లు ఇవీ.. 
    

  •    రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 
  •     ప్రతి నెలా గౌరవ వేతనం కింద రూ.30 వేలు అందించాలి.
  •     హెల్త్​ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
  •     ఎంఎల్ఎస్​ గోదాం నుంచి సరైన తూకంతో రేషన్​ షాపులకు బియ్యం సప్లై చేయాలి 
  •     రెండేండ్లకోసారి రేషన్​షాపు లైసెన్స్​ పునరుద్ధరణ కోసం రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తోంది. దీనికి బదులు శాశ్వత లైసెన్స్​ అందించాలి
  •     హమాలీ దిగుమతి చార్జీలు, షాపుల కిరాయి, గుమస్తాల ఖర్చులను ప్రభుత్వమే భరించాలి
  •     దుకాణాలను మినీ సూపర్ మార్కెట్లుగా తీర్చిదిద్ది, అన్ని సరుకులు అందించాలి
  •     బియ్యం కమీషన్ ప్రతి నెలా పెండింగ్ లేకుండా చెల్లించాలి

మంత్రి చెప్పినా జీవో రాలే

రేషన్ డీలర్ల జేఏసీ రెండు నెలల కిందే తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించి, సమ్మె నోటీసులు అందజేసింది. దీంతో సివిల్​ సప్లయీస్​ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్ కమార్ డీలర్ల జేఏసీ నాయకులతో గత నెల 22వ తేదీన చర్చలు జరిపారు. 22 డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ పట్టుబట్టడంతో అందుకు సంబంధించి 24 గంటల్లో జీవో విడుదల చేస్తామని, సీఎం కేసీఆర్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు సీఎంతో మీటింగ్​ ఏర్పాటు చేయలేదు. అటు జీవో కూడా విడుదల కాలేదు. ఈ క్రమంలో సర్కారు తీరును నిరసిస్తూ డీలర్లు ఈ నెల 3 నుంచి సమ్మెకు దిగారు. దీంతో మూడు రోజులుగా రాష్ట్రంలోని రేషన్​షాపులన్నీ మూతపడ్డాయి. విషయం తెలియని పేదలు రోజూ రేషన్​షాపులకు వచ్చి నిరాశగా తిరిగి వెళ్తున్నారు. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటే లబ్ధిదారులు ఆందోళనకు దిగే అవకాశాలున్నాయి. 

మా సమస్యలను  వెంటనే పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రతి నెలా కనీస గౌరవ వేతనం కింద రూ.30 వేలు అందించాలి. రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్​ సౌకర్యం కల్పించాలి, పెండింగ్ లో ఉన్న రేషన్ ​​కిమీషన్ ను వెంటనే విడుదల చేయాలి. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన  ఉధృతం చేస్తాం. 
- సోమయ్య, రేషన్​డీలర్ల సంఘం నాయకుడు, మహబూబాబాద్​ జిల్లా