రేషన్​ డీలర్ల నుంచి వ్యాపారులకు ప్రభుత్వం బియ్యం

 రేషన్​ డీలర్ల నుంచి వ్యాపారులకు ప్రభుత్వం బియ్యం
  •     బియ్యం దొంగలు
  •     రేషన్​ డీలర్ల నుంచి వ్యాపారులకు చేరుతున్నయ్
  •     మహారాష్ట్ర దాకా ఈ నెట్ వర్క్ ఉన్నది: సీపీ సత్యనారాయణ
  •     కరీంనగర్ జిల్లాలో పంపిణీ జరగ్గానే కొందరు కలెక్ట్ చేసుకుపోతున్నరు
  •     హోటళ్లకూ ఇవే బియ్యం అమ్ముతున్నరని వెల్లడి
  •     పీడీఎస్ బియ్యం అక్రమంగా అమ్మినా.. రవాణా చేసినా పీడీ యాక్ట్ పెడ్తమని హెచ్చరికలు

కరీంనగర్, వెలుగు: ప్రభుత్వం నుంచి అందుతున్న బియ్యాన్ని పేద ప్రజలకు పంపిణీ చేయకుండా, కొందరు రేషన్ డీలర్లు అక్రమంగా వ్యాపారులకు అమ్ముతున్నారని కరీంనగర్ సీపీ సత్యనారాయణ చెప్పారు. అలాంటి వారిపై నిఘా కొనసాగుతోందని, త్వరలోనే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసే పాత నేరస్తులకు కరీంనగర్‌‌‌‌ కమిషరేట్‌‌లో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా అమ్మేవాళ్లు, రవాణా చేసే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై పీడీయాక్ట్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని వెంటనే బైండోవర్ చేయడంతోపాటు సస్పెక్ట్ షీట్లు తెరవాలని అధికారులను ఆదేశించారు. పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసే రైస్ మిల్లర్లు, హోటల్ యజమానులపైనా చర్యలు తప్పవన్నారు. కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల బియ్యం పంపిణీ జరగ్గానే.. కొందరు వ్యక్తులు వచ్చి కలెక్ట్ చేసుకుని పోతున్నారని.. వీరికి గ్రామ స్థాయి నుంచి మహారాష్ట్ర వరకు నెట్ వర్క్ ఉందని తెలిపారు. కొందరు ఇడ్లీ, దోశ చేసే హోటళ్లకు బియ్యం అమ్ముతున్నారని వివరించారు. పోలీస్, సివిల్ సప్లయ్స్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, అమ్మకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఐదుగురిపై పీడీ యాక్ట్
పీడీఎస్ బియ్యాన్ని కొనే రైస్ మిల్లర్లను గుర్తించామని, కొందరిపై కేసులు నమోదు చేశామని సత్యనారాయణ తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని కొంటున్న ఐదుగురు రైస్ మిల్లర్లు, వ్యాపారులపై పది రోజుల్లోగా పీడీయాక్ట్ కేసులను నమోదు చేస్తామని వెల్లడించారు. కోతిరాంపూర్‌‌‌‌లో బియ్యం దందా చేస్తున్న- వేణుగోపాల్, రామకృష్ణపై వన్ టౌన్‌‌లో కేసు పెట్టామని, అక్రమాలకు పాల్పడిన వారిలో డీటీ స్థాయి అధికారులను కూడా అరెస్టు చేశామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్న ప్రాంతాలను గుర్తించామన్నారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి, పీడీఎస్ బియ్యం, ఇసుక రవాణాను పూర్తిగా నియంత్రించడాన్ని సీరియస్ గా తీసుకున్నామని తెలిపారు. ఇందుకోసం దాడులు కొనసాగించడంతోపాటు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఏడాదిలో 21 కేసులు 
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేస్తున్నామని సీపీ సత్యనారాయణ వెల్లడించారు. గత ఏడాది కాలంలో 21 కేసులను నమోదు చేసి రూ.18 లక్షల విలువైన 2,350 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో 40 మందిపై కేసులను నమోదు చేశామన్నారు. 2016 నుంచి 150 మందిపై కేసులను నమోదు చేశామని వివరించారు.