న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు, కోచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ కూడా తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమించాలని ఇంగ్లిష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తమ దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి సూచించాడు. ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అనుసరిస్తున్న బజ్‌బాల్ స్ట్రాటజీకి కాలం చెల్లిందన్నాడు.
ఆస్ట్రేలియాపై ఎలా గెలవాలో శాస్త్రికి బాగా తెలుసని చెప్పాడు. ‘ఆసీస్‌ను ఓడించగల వ్యూహాలు రచించగల వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. కంగారూల జట్టు బలహీనతలు, వారిని మానసికంగా, శారీరకంగా ఎలా ఎదుర్కోవాలి తెలిసి ఉండాలి. స్ట్రాటజీల పరంగా కూడా ఓ మెట్టుపైనే ఉండాలి. నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లండ్‌కు తదుపరి కోచ్‌గా రవిశాస్త్రిని నియమిస్తే బాగుంటుంది’ అని పనేసర్ వ్యాఖ్యానించాడు.
