
తమిళ నటుడు బాబీసింహా, హీరోయిన్ వేదిక, నటి అనసూయ, ఇంద్రజ, ప్రేమ ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ రజాకార్(Razakar). మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు తెలంగాణలో రజాకార్ల హింసకాండను చూపిస్తూ దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలనాటి పరిస్థితులను, అప్పుడు జరిగిన హింసాకాండను కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులను కూడా ఈ సినిమాను బాగానే ఆదరించారు.
కాగా.. ఇటీవలే థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రజాకార్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5 సంస్థ ఈ సినిమాను ఏప్రిల్ 26 లేదా మే 3న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇదే విషయం అధికారిక ప్రకటన కూడా రానుంది. మరి థియేటర్స్ లో మోస్తారు విజయాన్ని సాధించిన రజాకార్ మూవీకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఇక రజాకార్ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ను ఇండియాలో కలపడానికి ఒప్పుకోడు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన అండచూసుకొని రజాకార్ చీఫ్ ఖాసీం రిజ్వీ హైదరాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తాడు. అందుకోసం మతమార్పిడులకు పాల్పడతాడు. ఉర్దూ రానివారిని కఠినమైన శిక్షలు వేస్తాడు. అలాంటి వారి ఆకృత్యాలను కొంతమంది పోరాటయోధులు ఎలా ఎదుర్కొన్నారు అనేది రజాకార్ సినిమా కథ