నో ఛేంజ్.. వరుసగా ఐదోసారి యథాతథం.. వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

నో ఛేంజ్.. వరుసగా ఐదోసారి యథాతథం.. వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఐదో సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట లభించినట్లయింది. ఈ సారి కూడా పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటుతో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్దకే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతకుమునుపు రెపో రేటును 6.5 శాతం ఉండగా.. తాజాగా ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటనతో ఈ సారి కూడా రెపో రేటును 6.5 శాతం వద్దే స్థిరంగా ఉంది. రెపో రేటు అనేది RBI ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు.

తాజాగా జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ (మానీటరీ పాలసీ కమిటీ) సమావేశంలో అధికారులు ఈ కీలక విషయాలు తీసుకున్నారు. 2023 ఏడాది ముగింపుకు వచ్చిన క్రమంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్నారు. కానీ, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మాత్రం రిస్క్ లోనే కొనసాగుతోందని, దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నామని పేర్కొన్నారు.