మేము ఒక్క గ్రాము బంగారం కూడా అమ్మలే.. లెక్కలతో సహా చెప్పిన RBI

మేము ఒక్క గ్రాము బంగారం కూడా అమ్మలే.. లెక్కలతో సహా చెప్పిన RBI

భారత రిజర్వ్ బ్యాంక్ తన వద్ద ఉన్న బంగారు నిల్వలను అమ్మేసిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై బుధవారం తీవ్రంగా స్పందించింది. తాము దేశ బంగారాన్ని అమ్మేసినట్లు వస్తున్న నివేదికలు పూర్తిగా తప్పని కొట్టిపారేసింది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వల్లో ఒక్క గ్రాము కూడా తగ్గలేదని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వ్యాపించిన ఊహాగానాలకు ఆర్బీఐ అధికారిక ప్రకటనతో తెరదించింది.

ఈ మేరకు ఎక్స్ లో ఆర్బీఐ ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. కొన్ని మీడియా స్టోరీల్లో ఆర్బీఐ బంగారం అమ్మినట్లు వస్తున్న నివేదికలు తమ దృష్టికి వచ్చాయని.. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వల వివరాలను ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ ద్వారా క్రమం తప్పకుండా వెల్లడిస్తామని గుర్తు చేసింది. ప్రస్తుత తేదీ నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న ఫిజికల్ గోల్డ్ రిజర్వ్స్ ఎలాంటి మార్పులు లేకుండా 880.52 టన్నులుగా కొనసాగుతున్నట్లు ప్రకటించింది.

మరోవైపు ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ఆర్బీఐ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని "ఫేక్" అని తేల్చేసింది. రిజర్వు బ్యాంక్ లెక్కల ప్రకారం భారత విదేశీ మారక నిల్వల్లో గోల్డ్ వాటా సెప్టెంబర్ 2025 చివరి నాటికి 13.92 శాతంగా ఉంటే.. అది మార్చి 31, 2026 నాటికి 16.70 శాతానికి పెరిగిందని పేర్కొంది. అంతేకాదు మే 22, 2026 నాటికి ఈ వాటా మరింత పెరిగి 16.85 శాతానికి చేరుకుందని పీఐబీ స్పష్టం చేసింది. గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతుంటే అమ్మేశారనడం ముమ్మాటికీ అబద్ధమంది. 

విదేశీ కరెన్సీ ఆస్తులను కొనుగోలు చేయడానికి మే 22తో ముగిసిన రెండు వారాల్లో ఆర్బీఐ దాదాపు 12 బిలియన్ డాలర్ల బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ పేర్కొనడం ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. ఇలాంటి సున్నితమైన ఆర్థిక విషయాల్లో సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఆర్బీఐ సమయానుకూలంగా అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలకు స్పష్టం చేసింది.

►ALSO READ | షాకింగ్.. మోడీ ప్రభుత్వం 2 వారాల్లోనే రూ.లక్షా 14వేల కోట్ల విలువైన బంగారం అమ్మేసిందా..?