తెలంగాణ సర్కారుకు ఆర్బీఐ లేఖ

తెలంగాణ సర్కారుకు ఆర్బీఐ లేఖ
  • ఎస్ఎల్‌‌‌‌బీసీ, వ్యవసాయ శాఖకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ లెటర్
  • మా సిఫార్సులు ఏ మేరకు అమలు చేస్తున్నరు?
  • డిసెంబర్ 1 కల్లా సమాచారమివ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సిఫార్సు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్.. ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌‌‌‌బీసీ), వ్యవసాయ శాఖకు లెటర్ రాసింది. డిసెంబర్ 1వ తేదీ కల్లా సమాచారం ఇవ్వాలని సూచించింది. నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ ప్రకారం ఫ్రేమ్‌‌‌‌వర్క్ చేసుకుని కౌలు రైతులకు క్రాప్ లోన్లు ఇవ్వాలని గత సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రికమండ్ చేసింది. 2011 ల్యాండ్ లైసెన్స్‌‌‌‌డ్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారమైనా ఇవ్వాలని సూచించింది. ఇప్పుడు ఈ విషయమై ఆరా తీసింది. రాష్ట్రంలో కౌలు రైతులకు లోన్లు, సబ్సిడీలు అందడం లేదు.

రుణ అర్హత కార్డులు ఇస్తలే

కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణ అర్హత కార్డులను (ఎల్‌‌‌‌ఈసీ) గతంలో రెవెన్యూ శాఖ ఇచ్చేది. ఈ కార్డు చూపితే బ్యాంకులు క్రాప్ లోన్లు ఇచ్చేవి. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని రైతు సంఘాల చెప్తున్నయి. ఇందులో మొత్తానికే సొంత భూమి లేకుండా కౌలుకు తీసుకునేటోళ్లు, కొద్దోగొప్పో భూమి ఉండి మరికొన్ని ఎకరాలను కౌలుకు తీసుకునే వాళ్లు ఉన్నారు. భూమి లేని కౌలు రైతులకు పంటల సాగుకు సాయపడాలని, జాయింట్ లయబులిటీ గ్రూప్ (జేఎల్‌‌‌‌జీ)గా ఏర్పాటు చేసి క్రాప్ లోన్లు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు, నాబార్డు సిఫార్సు చేసినా సర్కారు పట్టించుకోవడం లేదు. నాలుగేండ్లుగా రుణ అర్హత కార్డులను ఇవ్వడం ఆపేసింది.

పట్టా పాస్ పుస్తకంలో కాలమ్ ఎత్తేసిన్రు

పంట రుణం అందకపోవడంతో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగుచేస్తున్నారు. కౌలు రైతులను గుర్తించబోమని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ రెండు సార్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆఫీసర్లు పట్టించుకోవడమే మానేశారు. 2018లో కొత్త పట్టా పాసు పుస్తకం తీసుకురాగా, అందులో అనుభవదారు కాలమ్ ఎత్తేశారు. పంటలబీమా, రైతుబీమా, రైతుబంధు, సబ్సిడీలు, పంటను ఎంఎస్పీకి అమ్ముకునేందుకు కౌలు రైతులకు అవకాశం లేకుండా పోయింది.