రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. దేశ భవిష్యత్తు భద్రత కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ తన వద్ద ఉన్న బంగారం నిల్వలను మునుపెన్నడూ లేనంత భారీగా పెంచుకుంటూ పోతోంది. కేవలం బంగారం నిల్వలను పెంచడమే కాకుండా.. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గమనిస్తూ మన దేశ సంపదను మన దేశంలోనే దాచుకోవాలనే వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే విదేశాల్లో దాచిన టన్నుల కొద్దీ బంగారాన్ని తిరిగి స్వదేశానికి తరలిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వల వివరాల్లోకి వెళితే.. బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ పరిధిలోనే ఏకంగా 568.20 టన్నుల భారీ బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు మార్చి 2025 నాటి నుంచి ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడే ఆర్బీఐ ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. గతంలో మన దేశానికి చెందిన చాలా వరకు బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో భద్రపరిచేవారు. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను బట్టి మన దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక రక్షణను చాటిచెప్పేలా ఈ భారీ నిల్వల్లో ఎక్కువ భాగాన్ని సొంత గడ్డపైనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయించాయి.
ఈ కొత్త వ్యూహం ప్రకారం ప్రస్తుతం బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్‌లోని 568.20 టన్నుల బంగారంలో.. ఏకంగా 367.73 టన్నుల బంగారాన్ని దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో భద్రపరిచారు. కేవలం 200.47 టన్నుల బంగారాన్ని మాత్రమే ప్రస్తుతం విదేశీ బ్యాంకుల్లో ఉంచారు. విదేశాల్లో ఉన్న నిల్వల కంటే మన దేశంలో ఉన్న నిల్వలు భారీగా పెరగడం అనేది భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన పెద్ద విజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మన సంపద మన దేశంలోనే ఉండటం వల్ల ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు వచ్చినా మనకు వచ్చే ముప్పేమీ ఉండదనే ధీమా వ్యక్తమవుతోంది.
ALSO READ : అమెరికా కంపెనీ కాంట్రాక్ట్ కోల్పోయిన HCLTech..
స్వదేశానికి బంగారాన్ని తరలించే ఈ ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా శరవేగంగా సాగుతోంది. ఆర్బీఐ గతంలో కంటే ఇప్పుడే అత్యధిక మొత్తంలో బంగారాన్ని ఇండియాకు తీసుకొచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 107.21 మెట్రిక్ టన్నుల బంగారాన్ని, ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో 103.68 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశాల నుండి తిరిగి భారత్‌కు తీసుకొచ్చారు. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఏకంగా 168.06 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విజయవంతంగా భారతదేశానికి తరలించింది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం.
గ్లోబల్ మార్కెట్‌లో రూపాయి విలువను కాపాడటానికి, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ఈ పసిడి నిల్వలు ఆర్బీఐకి కొండంత అండగా నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి మధ్య, దేశీయంగా బంగారం నిల్వలను రికార్డు స్థాయిలో పెంచుకుంటూ పోవడం ద్వారా భారత్ ఎంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందో స్పష్టమవుతోంది. సామాన్యులకే కాదు, దేశాన్ని నడిపించే కేంద్ర బ్యాంకుకు కూడా బంగారంపై ఉన్న నమ్మకం ఎంతటిదో ఈ భారీ నిల్వలు నిరూపిస్తున్నాయి.
