వడోదరా: ఐదు వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు డబ్ల్యూపీఎల్‌లో తొలి ఓటమి ఎదురైంది. బ్యాటింగ్‌లో విఫలమైన ఆర్సీబీ శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తయింది. టాస్ ఓడిన ఆర్సీబీ 20 ఓవర్లలో 109 రన్స్‌కే ఆలౌటైంది. స్మృతి మంధాన (38) టాప్ స్కోరర్. రాధా యాదవ్ (18), జార్జియా వోల్ (11) మోస్తరుగా ఆడారు.
ఢిల్లీ బౌలర్ల దెబ్బకు ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నందిని శర్మ 3, చినెల్లీ హెన్రీ, మారిజేన్ కాప్, మిన్ను మణి తలో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఢిల్లీ 15.4 ఓవర్లలో 111/3 స్కోరు చేసి గెలిచింది. లారా వోల్‌వార్ట్ (42 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (24) మెరుగ్గా ఆడారు. షెఫాలీ (16), లిజెల్లీ లీ (6) ఫెయిలైనా.. లారా కీలక ఇన్నింగ్స్ ఆడింది. జెమీమాతో మూడో వికెట్‌కు 52, కాప్ (19 నాటౌట్)తో నాలుగో వికెట్‌కు 37 రన్స్ జోడించి ఈజీగా విజయాన్ని అందించింది. ఆర్సీబీ బౌలర్లలో సయాలీ 2 వికెట్లు తీసింది. కాప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
