ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇండియా, ఆప్ఘానిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి పాక్ సిద్ధంగా ఉందని కయ్యానికి కాలు దువ్వారు. ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లో బాంబ్ పేలుడుతో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు.
ఈ ఆత్మాహుతి బాంబు దాడికి పాకిస్తాన్ తాలిబన్ (టీటీపీ) సంస్థ బాధ్యత వహించింది. అయితే.. ఈ దాడి వెనక ఆప్ఘానిస్తాన్, ఇండియా హస్తం ఉందని పాక్ నిరాధార ఆరోపణలు చేస్తోంది. తాజాగా ఈ ఘటనపై పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. ఇస్లామాబాద్ ఆత్మాహుతి బాంబు దాడిలో ఆప్ఘానిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు.
►ALSO READ | బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు..ప్రభుత్వంపై యువత తిరుగుబాటు
ఈ దాడి ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి వచ్చిన సందేశమని..- పాకిస్తాన్ ప్రతిస్పందించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తూర్పు సరిహద్దులో భారత్, పశ్చిమ సరిహద్దులో తాలిబన్లపై రెండు వైపులా యుద్ధానికి పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మొదటి రౌండ్‌లో అల్లాహ్ మాకు సహాయం చేశాడని.. రెండవ రౌండ్‌లో కూడా ఆయన మాకు సహాయం చేస్తాడన్నారు.
