కొత్త కార్పొరేషన్ల ఆఫీసులు రెడీ.. తార్నాకలోని HMDA పాత ఆఫీసులోగ్రేటర్ మల్కాజిగిరి కార్యాలయం

కొత్త కార్పొరేషన్ల ఆఫీసులు రెడీ.. తార్నాకలోని HMDA పాత ఆఫీసులోగ్రేటర్ మల్కాజిగిరి కార్యాలయం
  • హైటెక్ సిటీ న్యాక్ బిల్డింగ్​లో  గ్రేటర్ సైబరాబాద్ ఆఫీసు  
  • ఇప్పటికే కమిషనర్ల ఛాంబర్లు రెడీ
  • ఆ రెండు కమిషనరేట్లకే వారే కమిషనర్లు

 హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో మున్సిపల్​కార్పొరేషన్ల విభజనకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి11న కొత్తగా ఏర్పడే రెండు కార్పొరేషన్లకు సంబంధించిన గెజిట్ విడుదల కానున్నది. ఆ తర్వాత జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్లు సపరేట్ గా ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం రెండు కొత్త కమిషనరేట్ల కార్యాలయాలను ఇప్పటికే రెడీ చేశారు. ప్రస్తుతం ఉన్న చోటనే జీహెచ్ఎంసీ ఆఫీసు కొనసాగనుండగా, మల్కాజిగిరి ఆఫీసును తార్నాకలోని పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో అలాగే సైబరాబాద్ ఆఫీసును హైటెక్ సిటీలోని న్యాక్ భవనంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఛాంబర్లు సిద్ధం చేశారు. 

ఒక్కో కార్పొరేషన్​లో మూడు జోన్లు  

మూడు చొప్పున జోన్లతో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్  జోన్లతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పడనున్నట్టు తెలుస్తున్నది. ఇందులో 14 సర్కిల్స్ ఉండగా వీటి కింద 74 వార్డులు ఉండనున్నాయి. ఈ కార్పొరేషన్​కు కమిషనర్ గా ఈ జోన్లకి  ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ గా మానిటరింగ్ చేస్తున్న ఐఏఎస్​ఆఫీసర్​వినయ్ కృష్ణారెడ్డిని నియమించే అవకాశముంది. 
గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ లో  శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండనున్నాయి. ఇందులో 16 సర్కిల్స్ 76 వార్డులు ఉండనున్నట్లు తెలిసింది. ఈ కార్పొరేషన్​కు కమిషనర్ గా ఈ జోన్లకి ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ గా మానిటరింగ్ చేస్తున్న ఐఏఎస్​ఆఫీసర్​సృజనను నియమించే ఛాన్స్​ ఉంది. ఇప్పటికే ఏర్పడిన కార్యాలయాల్లో వీరు అడిషనల్ కమిషనర్ హోదాలో అందుబాటులో ఉంటున్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత అక్కడి కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.  

ఫిబ్రవరి 11 తర్వాత అందుబాటులోకి అన్ని విభాగాలు...

వచ్చేనెల11వ తేదీ తర్వాత రెండు కార్పొరేషన్లకి సంబంధించిన ఆఫీసుల్లో అన్ని విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. అందుకు అనుగుణంగా ఛాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి కావల్సిన ఫర్నిచర్, కంప్యూటర్లు సమకూర్చే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.  ఒక్కసారిగా కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత ఇక్కడి నుంచే పాలనమొదలు కానుండగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అందుతున్న అన్ని సేవలు ఆయా కార్పొరేషన్ల నుంచే అందనున్నాయి.