- చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల కబ్జా
- ధరణిలో లొసుగులను అవకాశంగా మార్చుకుంటున్న రియల్టర్లు
- ఇల్లీగల్ లేఅవుట్లలో ప్లాట్లను జనాలకు అంటగడుతున్రు
నల్గొండ, వెలుగు: నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్(నాలా) పర్మిషన్లను అడ్డంపెట్టుకుని రియల్టర్లు చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. పట్టా భూములను నాలాగా మార్చిన తర్వాత జరుగుతున్న మోసాల గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో రియల్ మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ దందా నడిపిస్తున్నా అధికారులు వారికేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నా రు. నల్గొండ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన రియల్ మోసాల వెనక దాగిన నిజాలు తెలిసి అధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ధరణి లేనప్పుడు నాలా పర్మిషన్ ఇచ్చే అధికారం ఆర్డీఓలకు ఉండేది. ఫీల్డ్ లెవల్లో భూముల పరిశీలన జరిగాకే నాలా పర్మిషన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ధరణిలో స్లాట్ బుక్ చేసుకుంటే చాలు. వెంటనే నాలా పర్మిషన్ వచ్చేస్తోంది. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్, వక్ఫ్ ల్యాండ్స్ లాంటివి ఏమైనా ఉంటే చట్టపరంగా తీసుకునే ఎలాంటి చర్యలకైనా కట్టుబడి ఉంటామని సంబంధిత వ్యక్తుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుని నాలా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. కానీ రియల్టర్లు తెలివిగా పట్టా భూముల్లో నాలా పర్మిషన్లు తీసుకుని వాటికి ఆనుకుని ఉన్న చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. నాలా పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఫీల్డ్ ఎంక్వైరీ జరిగితే ఇలాంటి తప్పులకు ఆస్కారం ఉండదని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ అలాంటి పవర్స్ తహసీల్దార్లకు ఇవ్వలేదు. కేవలం ధరణిలో నాలా పర్మిషన్ ఇవ్వడం వరకే సరిపెట్టారు. ఫీల్డ్ రిపోర్ట్ అంటే టైం పడుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఒక్క క్లిక్‌తో ధరణిలో ఒకే చెప్పేస్తోంది. కానీ దీనివల్ల వెంచర్లలో ప్లాట్లు కొన్న జనాలు నష్టపోవడమేగాక, ఖరీదైన ప్రభుత్వ భూములు కనిపించకుండా మాయమైపోతున్నాయి.
మంత్రి పేరుతో రియల్ దందా
హైదరాబాద్–-విజయవాడ నేషనల్ హైవే, ఇటు నార్కట్‌పల్లి, -అద్దంకి స్టేట్ హైవేకు మధ్యలో నార్కట్‌పల్లి మండలం విస్తరించింది. దీంతో ఇక్కడ భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆక్రమణలన్నీ ఈ మండలం చుట్టే తిరిగాయి. నార్కట్‌పల్లిలోని పెద్దచెరువు, ఏపీ లింగోటంలోని హాసిని, వాసవి వెంచర్లు హైవేకు ఆనుకుని ఉన్నా యి. ఈ రెండుచోట్ల ప్రభుత్వ, చెరువుల భూములు ఆక్రమణకు గురికావడమేగాక, ఇల్లీగల్ లేఅవుట్లతో అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో రుజువైంది. అయితే వీటి వెనక జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు చివ్వెంల వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి ఉన్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా మంత్రి పేరు అడ్డంపెట్టుకుని కొందరు రియల్టర్లు భూములు కబ్జా చేస్తున్నారని రూలింగ్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో పెద్ద చెరువు 163 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువులో సర్వే నంబర్లు 480, 481, 485, 486, 550 లో 2.3 ఎకరాలు పట్టా భూమి, 97 ఎకరాలు అసైన్డ్ లాండ్స్ ఉండగా, మిగిలినవి ప్రభుత్వ భూములు. అయితే ఇదే ప్రాంతంలో 485,490, 548, 547, 548 సర్వే నంబర్లలో రాజారాంతో పాటు మరికొందరికి 20 ఎకరాలకు పట్టా ఉంది. ఈ భూములు నాలా కన్వర్షన్ అయ్యాయి. ఈ భూములతో కలిపి చెరువు శిఖం, బఫర్ జోన్, అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్ వేస్తున్నారు. నిజానికి ఈ చెరువు కబ్జా గురించి గతేడాది జులైలోనే మండలానికి చెందిన రూలింగ్ పార్టీ లీడర్లు తహసీల్దారుకు కంప్లైట్ చేశారు. కానీ అప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోకుండా వదిలేశారు. అదే వెంచర్లోకి వెళ్లేందుకు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ప్రభుత్వ సర్వే నంబరు 481 నుంచి రోడ్డు వేస్తుండటంతో రైతులు అడ్డుకుని ఎంపీ కోమటిరెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగి సర్వే చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో రెండెకరాలు కబ్జా అయినట్లు గుర్తించారు. మరో వారం రోజుల్లో సర్వే పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని నార్కట్‌పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో 94 ఎకరాల్లో సర్వే నంబర్లు 120, 121,123,144,146,151, 195లో హాసిని, వాసవి పేర్లతో వెంచర్ వేశారు. ఈ వెంచర్‌కు డీటీసీపీ అప్రూవల్, గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోలేదు. హైకోర్టు ఆర్డర్స్అడ్డంపెట్టుకుని ప్లాట్లు రిజి స్ట్రేషన్ చేస్తున్నారు. ఈ వెంచర్ లోపల సర్వే నంబర్లు 194, 145లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. నిజానికి ఈ వెంచర్లో ప్రభుత్వ భూములు కబ్జా చేశారని రెండేళ్ల క్రితమే గ్రామస్థులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా పెద్ద చెరువు వివాదంతో ఈ వెంచర్ బాగోతం కూడా వెలుగులోకి వచ్చింది. 194 సర్వే నంబరులో రెండెకరాలు, 145 సర్వే నంబర్లో 8.45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీనిపైన ప్రాథమికంగా విచారణ చేపట్టగా రెండెకరాలు కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఇదే భూమి నుంచి వెంచర్లోకి వెళ్లేందుకు రోడ్డు నిర్మించినట్లు గుర్తించారు.
అవన్నీ ఇల్లీగల్ లే అవుట్లే..
హైకోర్టు ఆర్డర్స్ అడ్డం పెట్టుకుని గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. పాత రూల్ ప్రకారం పది శాతం భూమి పంచాయతీలకు ఇవ్వాలి. కొత్త యాక్ట్ ప్రకారం పదిశాతం భూమితోపాటు, 15 శాతం ప్లాట్లు గ్రామ పంచాయతీ పేరు మీద మార్టిగేజ్ చేయాలి. డీటీసీపీ అప్రూవల్, పంచాయతీ పర్మిషన్ లేకుండా వేస్తున్న వెంచర్లన్నీ ఇల్లీగల్ కిందకే వస్తాయి. ఈ వెంచర్లలో ప్లాట్లు కొన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాదు.
- డి. విష్ణువర్ధన్ రెడ్డి, డీపీఓ,
నల్గొండ జిల్లా
